Wednesday, May 1, 2024

ఇక సైకిల్ పై క‌న్నా..

అమరావతి, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరిక దాదాపుగా ఖరారైంది. ఇప్పటికే పలు దఫాలు తన అనుచర వర్గంతో చర్చలు జరిపిన కన్నా చివరికి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వ సనీయ సమాచారం. తాజాగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో ఆయన గుంటూరులోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో అనుచర వర్గంతో పూర్తిస్థాయిలో చర్చించిన కన్నా చివరికి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమౌతోంది. ఈనెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ చేరికకు తెలుగుదేశం పార్టీ నుండి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. పది రోజుల క్రితం హైదరాబాద్‌లో తన సన్నిహితులైన టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమైన కన్నా పార్టీలో చేరేందుకు సుముఖత చూపారు. ఈ అంశాన్ని తెదేపా నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకురావడంతో ఆయన కూడా ఆమోదముద్ర వేశారు. ఈనేపథ్యంలోనే కన్నా లక్ష్మీనారాయణ అనుచర వర్గంతో భేటీలు నిర్వహించి తుదినిర్ణయం తీసుకున్నారు. దీంతో బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం జనసేన లేదా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలకు దాదాపుగా చెక్‌ పడింది.

బలం పుంజుకోనున్న టీడీపీ :
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేరికతో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోనుంది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా గుర్తింపు గుంటూరు జిల్లాలో మంచి పట్టు కలిగిన నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు సామాజికవర్గం కీలకంగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ గూటికి కన్నా చేరుతుండటంతో ఆపార్టీకి సామాజికవర్గం అండ కొంతవరకూ లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కన్నా లక్ష్మీనారాయణకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంచి ప్రాధాన్యత కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఆ రెండు స్థానాల్లో ఒక చోట :
ఇదిలా ఉంటే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిక దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం గుంటూరు జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఒక నియోజకవర్గం నుండి బరిలోకి దింపే యోచనలో ఉంది. ఇప్పటికే సత్తెనపల్లితో పాటు గుంటూరు పశ్చిమ నియోకవర్గం నుండి కన్నా అభ్యర్ధిత్వాన్ని తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది. అయితే, కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరిన అనంతరం అధిష్టానం తుది నిర్ణయం తీసుకుని స్పష్టమైన ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement