Monday, April 29, 2024

jonnavithula : ఏపీలో ‘జై తెలుగు’ పేరుతో కొత్త పార్టీ

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రకటించారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఏర్పాటు గురించి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ… తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నానని… రాజకీయ నాయకులకు, ప్రజలను చైతన్య వంతులుగా చేయడానికే ఈ రాజకీయ వేదిక అని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయిందని… భాషా, సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయిందని చెప్పారు. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించానని వివరించారు. మన భాష సంస్కృతి వైభవం గురించి నేడు ఎవ్వరికీ తెలియని పరిస్థితి అని… నాడు మదరాసీలు అన్నారు.. నేడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామన్నారు.

కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామని… మన భాషను మనమే విస్మరించి చులకన చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ భాష మొత్తం ఒక్కటే.. ఏపీలొ మాత్రం ప్రాంతాల వారీగా భాష మారిపోతుంది… మన భాష కు పునర్వైభవాన్ని తీసుకురావాలనేదే నా సంకల్పం అని చెప్పారు. లక్షల కోట్ల బడ్జెట్, అధికారం ఉన్న ప్రభుత్వాలు తెలుగు భాషకు సమున్నత స్థానం కల్పించాలని.. త్వరలో మా పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగు భాషా పరిరక్షణ అజెండాతో వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించారు. తెలుగు భాష కోసం ఐదుగురు ‌మహనీయులు కృషి చేశారని.. త్యాగాలు చేశారని వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చిత్రాలు తన జై తెలుగు రాజకీయ జెండాలో, ఎజెండాలో ఉంటాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement