Monday, April 29, 2024

సిబిఐ దూకుడు – రెండు రోజులలో జగన్ ఢిల్లీకి పయనం?

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం, ఇదే సందర్భంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సోమవారం సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన నేపధ్యంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ముఖ్య నేతలతో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు వ్యవహారంలో మారుతున్న పలు సమీకరణల నేపధ్యంలో సీఎం జగన్‌ రెండు, మూడు రోజుల్లో ఢిల్లిd వెళ్లి కేంద్ర పెద్దలను కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే జగన్‌ లండన్‌ పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల చివరి వారంలో తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్‌ దంపతులు వారం రోజుల పాటు లండన్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ వేగం పెంచడం సోమవారం పలు నాటకీయపరమైన సంఘటనలు చోటుచేసుకోవడంతో సీఎం జగన్‌ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం అయ్యారు. పై కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని మరోసారి ఢిల్లి పెద్దల దృష్టికి తీసుకెళ్లే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండు, మూడు రోజుల్లో ఢిల్లి వెళ్లి కేంద్ర పెద్దలతో సీఎం జగన్‌ సమావేశం అవుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందులో భాగంగానే లండన్‌ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.

ముఖ్య నేతలతో..జగన్‌ భేటీ
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. విజయవాడలో జరిగిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి హాజరయ్యే ముందు వరకు కూడా నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కీలకమైన ఈ భేటీలో టీ టీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తదితర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందే సీఎం జగన్‌ అనంతపురం పర్యటనను కూడా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. భాస్కర్‌రెడ్డి అరెస్టు నేపధ్యంలో సోమవారం అధికారిక కార్యక్రమాలను కూడా సీఎం జగన్‌ రద్దు చేసుకున్నారు. కేసు వ్యవహారంపైనే ముఖ్య నేతలతో పాటు న్యాయ నిపుణులతో చర్చించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ముఖ్య నేతలతో కేసు వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఇటువంటి సమయంలోనే మనమంతా ధృడంగా ఉండాలని, అవినాష్‌తో పాటు భాస్కర్‌రెడ్డికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం జరుగుతున్నదని ఇటువంటి ప్రచారాలను నిర్మాణాత్మక వివరణతో తిప్పి కొట్టాలని సీఎం జగన్‌ ముఖ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

కోర్టులపై అపారమైన నమ్మకం, విశ్వాసం ప్రభుత్వానికి ఉందని, ఈ కేసు విషయంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్న విశ్వాశాన్ని కూడా జగన్‌ వ్యక్తం చేసినట్లు సమాచారం. సీబీఐ కేసు వ్యవహారంలో చోటుచేసుకుంటున్న ప్రతి చిన్న అంశాన్ని కూడా తెలుగుదేశం ఇతర పార్టీలన్ని రాజకీయం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని, లేని దానిని ఉన్నట్లుగా చిత్రీకరించే పరిస్థితికి దిగజారుతున్నాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై ఎవరూ, ఎక్కడ మాట్లాడవద్దని, ఒక వేళ మాట్లాడాల్సి వస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో సమాచారం తీసుకుని మాట్లాడేలా ఉండాలని, అస్పష్టతతో ఎవరూ మాట్లాడకుండా చూడాలని ముఖ్య నేతలకు జగన్‌ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement