Thursday, May 16, 2024

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి సిబిఎస్ఈ త‌ర‌హా సిల‌బ‌స్…జ‌గ‌న్

అమ‌రావ‌తి – వ‌చ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ తరహాలో ఏపీ సిలబస్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విద్యా విధానం అమలు చేయాలని, తర్వాత ఏటా ఒక్క తరగతి పెంచుకుంటూ వెళ్లాలని ఆదేశించారు. 2024 నాటికి 10 తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలన్నారు. ‘మనబడి నాడు–నేడు’పై విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్‌ ఎస్‌పీడీ వెట్రి సెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమీక్ష అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. మన బడి ‘నాడు–నేడు’ తొలి దశ పనులపై సీఎం వైయస్‌ జగన్‌ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. త్వరలో రెండో విడత నాడు–నేడు పనులు ప్రారంభించనున్నామన్నారు. అంతేకాకుండా త్వరలో టీచర్ల నుంచి అంగన్‌వాడీ ఆయాల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. భవనాలు లేని 390 పాఠశాలలను రెండో దశలో నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అదనంగా టీచర్లకు, విద్యార్థులకు డిక్షనరీ ఇవ్వాలని సీఎం సూచించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement