Saturday, May 4, 2024

ఏపీతో కల్సి పనిచేసేందుకు జపాన్‌ కంపెనీల ఆసక్తి.. పెరుగుతున్న ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు

అమరావతి, ఆంధ్రప్రభ : యువతను పరిశ్రమలకు కావలసినట్లుగా తీర్చిదిద్దే ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్య వనరులకు కొదవలేదు. స్కిల్‌ గ్యాప్‌ ఉన్నచోట పరిశ్రమలు కోరినట్లు ఉచిత శిక్షణ ఇచ్చి యువతను తీర్చిదిద్దుతోంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఈక్రమంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. పరిశ్రమల అనుకూలిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం (ఐసిఎస్టీపీ) పేరుతో స్థానికంగా ఉండే పరిశ్రమలతోనే భాగస్వామ్యమై ఆయా సంస్థల్లో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించి అక్కడే ఉద్యోగాలు పొందేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 135 బహుళ, మధ్యతరహా, చిన్న పరిశ్రమల్లో 8976 మంది శిక్షణ తీసుకున్నారు. వారంతా ఆయా పరిశ్రమల్లోనే ఉద్యోగాలు పొందారు.

జాబ్‌మేళాల్లో 77,774 మందికి ఛాన్స్‌..

గడిచిన రెండున్నర ఏళ్ళలో జాబ్‌ మేళాలు, స్కిల్‌ కనెక్ట్‌ డ్రైవ్‌ ల ద్వారా రెండున్నరేళ్లలో 77,774 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. యూత్ ట్రైనింగ్‌ సెంటర్లు(వైటిసి), మహిళా ప్రాంగణాలతోపాటు వివిధ ట్రైనింగ్‌ పార్ట్‌ నర్స్‌ సహకారంతో 15325 మందికి శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు 1,23,696 మందికి యుఐపాత్‌, ఒరాకిల్‌, సేల్స్‌ ఫోర్స్‌, శ్యామ్‌ సంగ్‌ ప్రిజమ్‌, ఐబిఎం స్కిల్‌ బిల్డ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, సీడాక్‌, ఎడబ్ల్యూఎస్‌ అకాడమి సహా అనేక రకాల బహుళ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చారు. డసాల్ట్‌, సీమెన్స్‌ ల్యాబ్స్‌ లో గత మూడు సంవత్సరాల్లో సుమారు 2,20,000 మందికి శిక్షణ ఇచ్చారు. యువత నైపుణ్యానికి సానబట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. మైక్రోసాఫ్ట్‌ సంస్థతో అవగాహన కుదుర్చుకున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కళాశాలల యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.

శుభపరిణామం..

జపాన్‌ కోరుకునే పారిశ్రామిక వాతావరణానికి ఏపీ చిరునామాగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు – జపాన్‌ ప్రతినిధులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాదితో భేటీ అయిన జపాన్‌ ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు. త్వరలోనే పరస్పర అవగాహన ఒప్పందం దిశగా కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలందించే అంశంపై జపాన్‌ ప్రతినిధులు ప్రధానంగా ఏపీఈడీబీ సీఈవోతో చర్చించారు. యొకొహమ పరిశ్రమ ఆధ్వర్యంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యమైంది. . జైకా, జెట్రో వంటి జపాన్‌ సంస్థలతో కలిసి ప్రయాణిసున్నారు. శ్రీ సిటీకి 25 కి.మీ దూరంలో ప్రత్యేకంగా జపనీస్‌ ఇండస్ట్రియ్రల్‌ టౌన్‌ షిప్‌ (జిట్‌) ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో జపనీస్‌ కు చెందిన 1400 కంపెనీలు ఏర్పాటయ్యాయి. దక్షిణ భారత దేశంలో వాణిజ్యపరంగా ఏపీ అన్నింటికి అనువైన రాష్ట్రంగా జపాన్‌ ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తిని కనబర్చడం శుణపరిణామంగా చెప్పొచ్చు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement