Friday, May 17, 2024

Followup: ఆసక్తికరంగా జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. గంట గంటకూ బయటికొస్తున్న కొత్త విషయాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : జూబ్లిdహిల్స్‌ అత్యాచార ఘటన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోసారి అత్యాచారానికి గురైన మైనర్‌ బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. షీ టీమ్స్‌ పోలీసుల సమక్షంలో బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఫోటోలను బాలికకు చూపించి ఇందులో ఉన్న వారి వివరాలను సేకరించినట్టు సమాచారం. కొంత మందిని గుర్తించి తనపై లైంగిక దాడికి పాల్పడిన వారి వివరాలను ఆ బాలిక తన వాంగ్మూలంలో వివరించినట్టు సమాచారం. అమ్నీషియా పబ్‌ నుంచి బెంజి కారులో తీసుకువెళ్లిన క్షణం నుంచి తనపై కారులో ఉన్న నలుగురు అసభ్యంగా ప్రవర్తించారని అప్పటికే కారులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్టు ఆమె చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే కుమారుడిని అత్యాచారం కేసులో అరవ నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేందుకు సిద్ధమైన పోలీసులు న్యాయపరమైన సలహా తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే అత్యాచారానికి గురైన బాలిక వాంగ్మూలాన్ని జువైనల్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా బాలికపై అత్యాచారానికి సంబంధించిన ఫోటోలు, వీడియోని విడుదల చేసిన భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. ఈ అరెస్టుకు సంబంధించి జూబ్లిdహిల్స్‌ పోలీసులు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అనుమతి కోరగా ఆయన ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతోంది. న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని రఘునందన్‌రావుపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీస్‌ ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవాలన్నా, ఆయనపై కేసు నమోదు చేయాలన్నా అసెంబ్లిd స్పీకర్‌ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్న నిర్ణయానికి నగర పోలీసులు వచ్చారు.

నిందితులు ఉపయోగించిన బెంజి కారులో క్ల్యూస్‌ టీమ్‌ నిర్వహించిన తనిఖీల్లో అత్యాచారానికి గురైన బాలిక చెవికమ్మలు, చెప్పులు, వెంట్రుకలు సేకరించారు. నిందితుల వీర్యాన్ని (స్పెర్మ్‌)తో పాటు వారి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. కారులో స్వాధీనం చేసుకున్న టిష్యూ పేపర్లను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపించినట్టు పోలీసులు చెప్పారు. కాగా అత్యాచార ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించింది.

ఇదిలా ఉండగా సంచలనం సృష్టించిన జూబ్లిdహిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మరో రెండు యూట్యూబ్‌ ఛానళ్లకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

కార్పొరేటర్‌ పాత్రపై ఆరా
అత్యాచార నిందితులను కేసు నుంచి తప్పించేందుకు సహకరించిన ఓ కార్పొరేటర్‌ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అత్యాచార ఘటన జరిగిన తర్వాత నిందితులను సదరు కార్పొరేటర్‌ ఇన్నోవా వాహనంలో మొయినాబాద్‌లోని వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లి అక్కడ దాచి పెట్టినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ కారును బయట వారు ఎవరూ చూడకుండా వ్యవసాయ క్షేత్రంలో ఓ మూలన పెట్టి వాహనం అద్దంపై ఉన్న ప్రభుత్వ వాహనమన్న స్టిక్కర్‌ను తొలగించారని, తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ స్టిక్కర్‌ను కూడా కనపడకుండా చేశారని పోలీసులు గుర్తించారు. కారులో అత్యాచార ఆనవాళ్లు బయట పడకుండా స్థానికంగా వాహనాన్ని సర్వీసింగ్‌ కూడా చేయించినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ఒక రోజంతా క్షేత్రంలోనే ఉండి అక్కడి నుంచి కర్నాటక, ఇతర ప్రాంతాలకు పారిపోయారని ఇందుకు సదరు కార్పొరేటర్‌ సహకరించాడని సమాచారం. దీంతో అత్యాచారం కేసులో కార్పొరేటర్‌ను కూడా నిందితుడిగా చేర్చాలన్న నిర్ణయానికి జూబ్లిdహిల్స్‌ పోలీసులు వచ్చినట్టు సమాచారం.

- Advertisement -

పూటకో కొత్త విషయాలు.. మందకొడిగా దర్యాప్తు
అత్యాచారం ఘటనలో గంట గంటకు కొత్త విషయాలు బయటకు వస్తుండడంతో పోలీసులు దర్యాప్తును ఏ దిశగా చేపట్టాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నారు. కొత్త విషయాలు బయట పడుతుండడంతో ఈ కేసు ఆసక్తిగా మారుతోంది. ఇందులో ప్రజా ప్రతినిధుల పుత్రరత్నాలు ఉండడం, వాళ్లు కూడా మైనర్లు కావడంతో కేసు మరింత జటిలంగా మారింది. అత్యాచారం కేసు రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో పోలీసులు ఆచీతూచీ వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించిన పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో మరో రెండు, మూడు అరెస్టులు ఉండవచ్చని భావిస్తున్నారు. పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫోన్‌ సిడీఆర్‌, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించిన బాలిక చెవి రింగులు, చెప్పులు, వెంట్రుకలు, నిందితుల వీర్యం తదితర అంశాలపై వచ్చే నివేదిక ఆధారంగా ఈ కేసు కీలకంగా మారనున్నదని చెప్పారు. కాగా ఈ కేసులో జైలుకు పంపించిన ఐదుగురు మేజర్‌, మైనర్‌ నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు జూబ్లిdహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు.

రిమాండ్‌ రిపోర్టులో సంచలన అంశాలు
అమ్నీషియా పబ్‌ అత్యాచారం కేసుకు సంబంధించి జూబ్లిdహిల్స్‌ పోలీసులు కోర్టుకు నివేదించిన రిమాండ్‌ రిపోర్టులో సంచలన అంశాలు చోటు చేసుకున్నాయి. మైనర్‌ బాలికతో పాటు నిందితులు మరో బాలికను వేధించినట్టు అందులో పేర్కొన్నారు. అత్యాచారం కేసులో కార్పొరేటర్‌ తనయుడు కీలకంగా వ్యవహరించాడని సాదుద్దీన్‌, మాలిక్‌తో కలిసి పబ్‌లో అత్యంత హేయంగా బాలికతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ ఇద్దరు నిందితులు కలిసి మైనర్‌ బాలికలను వేధింపులకు గురి చేశారని అది తట్టుకోలేకే ఇద్దరు అమ్మాయిలు పబ్‌ నుంచి బయటకు వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. పబ్‌ నుంచి బయటకు వచ్చి మరో బాలిక క్యాబ్‌ బుక్‌ చేసుకుని వెళ్లిపోగా ఆ అమ్మాయి వెనకాలే బయటకు వచ్చిన సాదుద్దీన్‌ అత్యాచారానికి గురైన బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బాధిత బాలికను ట్రాప్‌ చేసిన కార్పొరేటర్‌ కొడుకు ఆమెను ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించినందుకే ఆమె వెళ్లిందని ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే మవనడు ఉమేర్‌ ఖాన్‌కు చెందిన బెంజి కారులో బాలికతో కలిసి నలుగురు ప్రయాణం చేసినట్టు చెప్పారు.

పబ్‌ నుంచి నేరుగా బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 14లో ఉన్న కాన్సూ బేకరీకి వెళ్లాకరి ప్రయాణంలో బాలికపట్ల నలుగురు అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ అరాచక భరించలేక ఆ అమ్మాయి బేకరి నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో ఆమెను నచ్చజెప్పి అక్కడి నుంచి కారులో రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లారని పోలీసులు తెలిపారు. బేకరీ నుంచి కొద్ది దూరం ప్రయాణించాక ఎమ్మెల్యే కుమారుడు పెట్రోల్‌ అయిపోయిందని మాయ మాటలు చెప్పి బెంజి కారు నుంచి దిగిపోయాడని వెనక వస్తున్న ఇన్నోవా కారులోకి బాదిత బాలికను తరలించారని తెలిపారు. వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కుమారుడు బాలికను ఇన్నోవాలోకి తరలించి బంజారాహిల్స్‌లోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అత్యాచారం చేశాక తిరిగి నిందితులంతా అమ్మాయితో కలిసి బేకరీకి చేరుకుని ఇంజాయ్‌ చేశామని గ్రూప్‌ ఫోటో దిగి ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేసినట్టు తెలిపారు. బేకరీ నుంచి ఎవరికి ఇంటికి వారు వెళ్లిన నిందితులు కేసు నమోదైన విషయం తెలిసి హైదరాబాద్‌ నుంచి పారిపోయారని పేర్కొన్నారు. ఇన్నోవా కారును వక్ఫ్‌ బోర్డు చైర్మనకు చెందిన మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో నిందితులు దాచారని పేర్కొన్నారు.

మరో అమ్మాయి ఎవరు?
అమ్మీషియా పబ్‌లో అత్యాచారానికి గురైన బాలికతో పాటు మరో అమ్మాయిని అత్యాచార గ్యాంగ్‌ వేధించారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడంతో ఆ అమ్మాయి ఎవరన్న అంశంపై ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. బాదిత బాలికకు రెండో అమ్మాయి స్నేహితురాలా లేక ఇరువురు కలిసి ఒకే తరగతిలో ఉన్నారా లేక ఒకే స్కూలా.. కళాశాల అనే అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ అమ్మాయి పబ్‌లో పరిచయమైందా లేదా పార్టీకి హాజరైందా అనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. పోలీసులు మాత్రం బాదిత బాలికతో పాటు మరో అమ్మాయిని గుర్తించి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు చెబుతున్నారు. ఈ అమ్మాయి ఇచ్చిన వివరాల ఆధారంగా కేసును మరింత బలోపేతం చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. అత్యాచారం కేసు విచారణాధికారిగా బంజారాహిల్స్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ సుదర్శన్‌ను నియమించడంతో ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితులను కస్టడీకిలోకి తీసుకుని ఆరా తీస్తే అత్యాచారానికి సంబంధించి మరింత సమాచారం వస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement