Friday, May 3, 2024

Delhi: శ్రీలంకతో రాష్ట్రాలకు పోలికెందుకు, ఆర్థిక క్రమశిక్షణ కేంద్రానికీ అవసరమే.. వైసీపీ ఎంపీల ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రాలను శ్రీలంకతో ఎలా పోలుస్తారని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ గురజాడ హాల్‌లో ఆ పార్టీ ఎంపీలు డాక్టర్‌ తలారి రంగయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, రెడ్డప్ప విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీలంకతో రాష్ట్రాలను పోల్చడం సరికాదన్నారు. శ్రీలంక ఆర్ధిక వ్యవస్థ పతనం కావడానికి వేర్వేరు కారణాలున్నాయని చెప్పుకొచ్చారు.

గణనీయంగా వాణిజ్య ఎగుమతులు
శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు గత మూడేళ్లలో చూస్తే తగ్గాయని, అదే సమయంలో రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయని ఎంపీలు అన్నారు. శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు 2019–20లో 19 బిలియన్‌ డాలర్లు కాగా, ఆ తర్వాత ఏడాది 2020–21లో అవి 13 బిలియన్‌ డాలర్లకు తగ్గి, 2021–22లో 14 బిలియన్‌ డాలర్ల వాణిజ్య ఎగుమతులు నమోదయ్యాయని వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయని హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర జీఎస్‌డీపీ మెరుగు

రాష్ట్ర జీఎస్‌డీపీని శ్రీలంక జీడీపీతో పోల్చితే మన జీఎస్‌డీపీ చాలా బాగుందని వైసీపీ ఎంపీలు తెలిపారు. శ్రీలంక జీడీపీ 81 బిలియన్‌ డాలర్లు కాగా, మన జీఎస్‌డీపీ 160 బిలియన్‌ డాలర్లు. అంటే ఒక దేశం కంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా ముందంజలో ఉందన్నారు. అప్పుల్లో కూడా రాష్ట్రానికి, శ్రీలంకకు ఎక్కడా పోలిక లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అప్పుల కంటే ఇవాళ కేంద్రం చేసిన అప్పులే ఎక్కువని ఎద్దేవా చేశారు. కేంద్రం అప్పులు ఏకంగా 133 లక్షల కోట్లకు చేరుకున్నాయని రంగయ్య, అయోధ్య రామిరెడ్డి, రెడ్డప్ప ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని వారు హితవు పలికారు.

ప్రతి రూపాయికి లెక్క ఉంది:
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ప్రతి రూపాయికి లెక్క ఉందని తేల్చి చెప్పారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ప్రజలకు చేరాయని ఎంపీలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా అప్పులు చేసి అనుత్పాదక రంగాలపై ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం కోసం ఇస్తున్న ప్రతి రూపాయి నిరుపేదల ఖాతాల్లో చేరుతోందని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమంతో స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్న రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చవద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

పోలవరం బాధ్యత కేంద్రానిదే

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వానిదే దాని బాధ్యతని వైసీపీ ఎంపీలు గుర్తు చేశారు. నిర్మాణ బాధ్యతను గత ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇప్పుడు కూడా నిర్మాణ పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్న ఎంపీలు, ప్రాజెక్ట్ ప్లానింగ్, డిజైనింగ్ బాధ్యతలు పూర్తిగా కేంద్రానివేనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement