Monday, April 29, 2024

Donations – రూ 250 కోట్లకు చేరిన గో సంరక్షణ ట్రస్ట్ నిధులు – టీటీడీ చైర్మన్ భూమన వెల్లడి

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : సకల దేవతా స్వరూపాలైన గోవులను సంరక్షించడానికి టి టి డి చేస్తున్న కృషికి స్పందనగా ఇప్పటి వరకు టి టి డి గో సంరక్షణ ట్రస్ట్ కు రూ 250 కోట్లు నిధులు సమకూరినట్టు టి టి డి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు కనుమ పండుగలో భాగంగా స్థానికి గో సంరక్షణ శాలలో టి టి డి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన గోపూజా కార్యక్రమంలో ఆయన అక్కడి వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన గౌరిపూజ, తులసిపూజలో పాల్గొన్నారు .అటుతర్వాత గజరాజులు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి దాణా అందించారు.

ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టినట్టు తెలిపారు. తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో 2,500కు పైగా గోవులు ఉన్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశీయ గో జాతుల పాల నుండి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఉత్సవాలలో, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో, స్థానిక ఆలయాలలో జరిగే ఉత్సవాలలో గో శాలలోని ఏనుగులు, అశ్వాలు, వృషబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రతిన బూనాలని పిలుపు నిచ్చారు. తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు . టి టి డి పవిత్రంగా నిర్వహిస్తున్న గో సంరక్షణ చర్యలకు స్పందంగా ఇప్పటి వరకు దాతలు రూ.250 కోట్లకు పైగా ”ఎస్వీ గో సంరక్షణట్రస్టు” కు విరాళాలు అందించినట్లు వివరించారు.

ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్‌ హరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ గోసంరక్షణ ట్రస్టు సభ్యులు రాం సునీల్ రెడ్డి , శ్రీధర్,ఎస్వీ బీసీ సిఈవో షణ్ముఖ కుమార్, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి సోమయాజులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు, పురప్రజలను ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement