Saturday, May 18, 2024

రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లకు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్

కర్నూలు బ్యూరో.రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ కు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ .కోర్టు ధిక్కరణ కింద ఆదేశాలు జారీ. కోర్టు ధిక్కారం వ్యవహారంలో అధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మంగళవారం రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ కు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హైకోర్టు ధిక్కార కేసులో వీరిద్దరూ న్యాయ స్ధానానికి హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇప్పటికే కోర్టు ధిక్కార కేసుల్లో పలువురు ఐఏఎస్ లకు జైలు శిక్షలు, జరిమానాలు పడుతున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ కళాశాలలకు గుర్తింపునివ్వకపోవడంపై సదరు కళాశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సదరు ఎంఈడీ కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాలేజీలు హైకోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ తమ ముందు హాజరు కావాలని రాయలసీమ వర్శిటీ వీసీ, రిజిస్ట్రార్ లకు ఆదేశాలు ఇచ్చింది.అయితే ఇవాళ రాయలసీమ వర్శిటీ వీసీ, రిజిస్ట్రార్ లు తమ ముందు హాజరుకాకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరికీ నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సదరు అధికారుల్ని హైకోర్టు ముందు పోలీసులు హాజరుపర్చాల్సి ఉంది. తదుపరి విచారణలో హైకోర్టు వీసీ, రిజిస్ట్రార్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతోందన్నది ఉత్కంఠగా మారింది. కోర్టు ధిక్కార వ్యవహారంలో హైకోర్టు విచారణకు హాజరుకాకపోవడంపై వీసీ, రిజిస్ట్రార్ అధికారికంగా స్పందించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement