Saturday, April 27, 2024

జర్నలిస్టులపై వృత్తి పన్ను భారాన్ని రద్దు చేయాలి

తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వారిపై వృత్తిపన్ను మోపడాన్ని నిరసిస్తూ స్థానిక సబ్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు తేళ్ల రవీంద్ర బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా జర్నలిస్టులపై వృత్తి పని భారాన్ని మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రతుకు భారమై జీవించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులపై మోపిన వృత్తి పన్ను భారాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా, జీవిత బీమా సౌకర్యాలను కల్పించాలన్నారు. వీటితో పాటు అక్రెడిటేషన్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులపై నిర్లక్ష్య, ఉదాసీన దోరనితో వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ దోరణి ఇప్పటికైనా మార్చుకోవాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారంతో పాటు మీడియా అకాడమీ ఏర్పాటు చేసి జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఫెడరేషన్ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా అమలు చేయని జర్నలిస్టుల వృత్తి పన్నును రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అమలుచేయడం శోచనీయమన్నారు. జర్నలిస్టుల వ్యతిరేక ప్రభుత్వంగా పాత్రికేయులు భావిస్తున్నారని ఈ వైఖరిని వెంటనే మార్చుకోవాలని కోరారు. వృత్తి పన్నును ప్రభుత్వం రద్దు చేయనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు. తొలుత సబ్ కలెక్టర్ కార్యాలయం డివిజనల్ పరిపాలనా అధికారి పెంచల్ ప్రభాకర్ కు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్, నాయకులు అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు బచ్చు సురేష్ బాబు, ఎస్ ఎస్ జహీర్, గుమ్మడి ప్రకాశరావు, అచ్యుత సాంబశివరావు, వి లక్ష్మణ్, శ్రీకాంత్, కరేటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement