Friday, April 26, 2024

సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా రెండో తెలుగు వ్య‌క్తి జ‌స్టీస్ ఎన్ వి ర‌మ‌ణ‌…

అమ‌రావ‌తి – భార‌త దేశ అత్య‌న్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన జ‌స్టీస్ ఎన్ వి ర‌మ‌ణ‌కు అవ‌కాశం ద‌క్క‌నుంది.. ప్ర‌స్తుత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎస్ ఎ బాబ్డే వ‌చ్చే నెల 23న ప‌ద‌వీవిర‌మ‌ణ చేయ‌నున్నారు..దీంతో ఆయ‌న త‌న వారసుడిగా జ‌స్టీస్ ర‌మ‌ణ పేరును ప్ర‌తిపాదిస్తూ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు.. అంత‌కు ముందు త‌దుప‌రి చీఫ్ జ‌స్టీస్ పేరును ప్ర‌తిపాదిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం జ‌స్టీస్ బాబ్డేకి లేఖ రాసింది.. ఈ మేర‌కు సుప్రీంకోర్టులో త‌న త‌ర్వాత సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉన్న ర‌మ‌ణ పేరును త‌న వార‌సుడిగా పేర్కొంటూ లేఖ రాశారు.. ఆ లేఖ ప్ర‌తిని జ‌స్టీస్ ర‌మ‌ణ‌కు కూడా బాబ్డే పంపిన‌ట్లు స‌మాచారం.. సీజేఐ జస్టిస్ బాబ్డే పంపిన సిఫారసును కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేంద్ర హోం శాఖకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నివేదిస్తారు. అనంతరం ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నివేదిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి సీజేఐని నియమిస్తారు. కాగా 54 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంత‌రం తెలుగు వ్య‌క్తికి సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కానున్నారు.. 1966 -67 లో జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన తొలి తెలుగు వ్య‌క్తి.. ఆ త‌ర్వాత ఇప్పుడు జ‌స్టీస్ ర‌మ‌ణ‌కు ఆ ప‌ద‌వీ వ‌రించ‌నుంది.. కాగా, ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27 న వ్యవసాయ కుటుంబంలో ర‌మ‌ణ జన్మించారు. గణపతిరావు, సరోజిని ఆయన తల్లిదండ్రులు. ఆయన కంచికచ‌ర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతి లోని ఆర్.వి.వి.ఎన్.కాలేజీలో బి.యస్సీలో పట్టా పొందారు. 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10 న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్‌లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఆ ప‌ద‌విలోనే కొన‌సాగ‌తున్నారు..ఇక దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. జమ్మూ-కశ్మీరులో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను తక్షణమే సమీక్షించాలని రూలింగ్ ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ రమణ కూడా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి పదవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పిన జడ్జీల ప్యానెల్‌లో కూడా ఆయన ఉన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో వివాద‌ర‌హితుడిగా జ‌స్టీస్ ర‌మ‌ణ పేరు తెచ్చుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement