Saturday, April 27, 2024

క‌రోనా క‌ట్ట‌డికి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు – క్యాబినేట్ స‌బ్ క‌మిటి

అమ‌రావ‌తి – కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఆస్పత్రుల్లో మెడిసిన్, ఆక్సిజన్‌ అన్నీ సిద్ధంగా ఉంచామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. అన్ని పరిస్థితులను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి రోజూ అధికారులతో సమీక్షలు చేస్తూ కరోనా నియంత్రణకు స్పష్టమైన ఆదేశాలతో దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. కోవిడ్‌ కట్టడి, వ్యాక్సినేషన్, కమాండ్‌ కంట్రోల్‌ నిర్వహణపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయ్యింది. కమిటీ సభ్యులు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సమావేశం అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌ నియంత్రణ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సీఎం ‌ జగన్‌ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్‌ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. సబ్‌ కమిటీ సమావేశంలో మంత్రులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొని సలహాలు, సూచనలు అందించారన్నారు. సమావేశంలో కోవిడ్‌ నివారణ చర్యలపై చర్చించడం జరిగిందన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో బెడ్స్‌ పెంచడం, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు పెంచడం, రెమిడిసివర్‌ ఇంజక్షన్, ఆక్సిజన్‌ కొరతను నివారించేందుకు అవసరమైన చర్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. ఆస్పత్రుల వద్ద హెల్ప్‌ డెస్క్‌లు, 104 కాల్‌ సెంటర్‌ మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు.
ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఆస్పత్రుల్లో బెడ్లు, మెడిసిన్, ఆక్సిజన్‌ అన్ని సిద్ధంగా ఉంచామన్నారు. ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని చెప్పారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నామన్నారు. ఎక్కడా కూడా ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, జగన్‌ నాయకత్వంలో అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే కరోనా బాధితుల నుంచి ఎక్కువగా వసూలు చేసే ప్రైవేట్‌ ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. దయచేసి అలాంటి పరిస్థితులను కొనితెచ్చుకోవద్దని సూచించారు. ప్రజలు కూడా బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పక ధరించాలని, శానిటైజర్‌ వాడాలని కోరారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని, ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రాన్ని కరోనా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దగలమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement