Friday, May 17, 2024

స్వేచ్ఛాయుత వాతావరణంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు – జిల్లా కలెక్టర్ వీరపాండియన్

జిల్లాలో 36 జడ్పిటిసి లకు, 483 ఎంపిటిసి లకు ఎన్నికలు.
. జెడ్పిటిసి బరిలో 146.
. ఎంపీటీసీ బరిలో 1308.
. జిల్లాలో 15.41 లక్షల మంది ఓటర్లు.
. ఎన్నికలకు మూడు వేల మందితో పోలీసు భద్రత.
. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.
.జిల్లా వ్యాప్తంగా 5 రాష్ట్ర,
10 జిల్లాల సరిహద్దు చెక్ పోస్టులు

కర్నూలు బ్యురో, – రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఈ నెల 8న జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ పక్కిరప్ప అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.
శుక్రవారం కర్నూలు జెడ్ పి మినీ సమావేశ హాల్లో జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల ఏర్పాట్ల పై కలెక్టర్, జిల్లా జిల్లా ఎస్పీ కె.పక్కీరప్పలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు రామ సుందర్ రెడ్డి, ఖాజా మొయినుద్దీన్ ,జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిపిఓ ప్రభాకర్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం గుర్తు చేశారు. దీంతో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కర్నూలు జిల్లాలో 53 జెడ్ పి టి సి ల స్థానాలలో 16 జడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం డిక్లేర్ చేశామన్నారు. ఇందులో కొలిమిగుండ్ల మండలం ఏకగ్రీవమైన జెడ్ పి టి సి ఒకరు మృతి చెందిన విషయం ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. నంద్యాల మండలంలో పోటీ చేస్తున్న జెడ్ పి టి సి ఒకరు మృతి చెందడం వల్ల అక్కడ ఎన్నికలు జరగవు అన్నారు. మిగిలిన 36 జడ్పిటిసి స్థానాలకు 146 మంది ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 36 జడ్పిటిసి స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 807 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 312 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు చెప్పారు. ఇందులో తొమ్మిది మంది ఎంపిటిసిలు మృతి చెందారన్నారు. ఆదోని మున్సిపాలిటీ లో మూడు ఎంపీటీసీ స్థానాలు విలీనం కావడంతో మొత్తం పన్నెండు ఎంపీటీసీ స్థానాలలో ఎన్నికల జరగవన్నారు. మిగిలిన 483 ఎంపీటీసీ స్థానాలలో ఈ నెల 8 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 483 ఎంపిటిసి స్థానాలలో 1308 మంది ఎన్నికల బరిలో ఉన్నారన్నారు. జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలలో మొత్తం 15,41,272 ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 7,69,863 మంది ఓటర్లు, మహిళలు 7,71,991 మంది ఓటర్లు, ఇతరులు 160 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 1763 పోలింగ్ స్టేషన్లలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ జరుగుతుందన్నారు. జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ అంతా రెడీగా ఉందని… పోలింగ్ మెటీరియల్ వెరిఫికేషన్ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.బ్యాలెట్ బాక్సులు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ 44, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ 44, జోనల్ ఆఫీసర్ 135, రూట్ ఆఫీసర్ 223, ప్లేయింగ్ స్క్వాడ్స్ 44, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ 44, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 2,143, పోలింగ్ ఆఫీసర్స్ 8462 మంది ఎన్నికలలో విధులు నిర్వహించనున్నారన్నారు. ప్లేయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 18004255180, వాట్సాప్ నెంబర్ 8897870074, మెయిల్ ఐడీ జడ్ పిపి కర్నూల్ అట్ జి మెయిల్ డాట్ కం లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. పంచాయతీ ఎన్నికలకు కమాండ్ కంట్రోల్ రూమ్ కు 2 వేల ఫిర్యాదులు వచ్చాయన్నారు. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి 300 ఫిర్యాదులు వచ్చిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు.

మూడు వేల మందితో భద్రత
జిల్లా ఎస్పీ కె.ఫక్కీరప్ప మాట్లాడుతూ జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మూడు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. తమిళనాడులో జరుగుతున్న ఎన్నికలకు నాలుగు వందల మందిని పోలీసులు ఎన్నికల విధులకు పంపించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 484 ప్రాంతాలలో 130 అతి సమస్యాత్మక, 110 సమస్యాత్మక, 244 సాధారణ ప్రాంతాలను గుర్తించడమైనదన్నారు. సమస్యాత్మక ప్రాంతాల పై ప్రత్యేక దృష్టిసారించి అదనపు పోలీసు బలగాలతో ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టులు , 10 ఇంటర్ జిల్లా బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ, తదితర అక్రమాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, ఫ్లయిండ్ స్క్వాడ్స్ తో ముమ్మరంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నామన్నారు. ప్రచారానికి సింగల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు తీసుకోవాలన్నారు. 30 పోలీసు యాక్టు మరియు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సభలు, ఊరేగింపులు, డప్పులు, బాణ సంచా కాల్చడం నిషేధించామన్నారు. ఏవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement