Sunday, May 5, 2024

Big Story | అర్చకులకు తీపి కబురు.. ఇకపై పదవీ విరమణ ఉండదు

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వం అర్చకులకు తీపి కబురు చెప్పబోతోంది. ఉద్యోగ, ఆర్థిక భద్రతతో పాటు ప్రభుత్వపరంగా ఇంటి స్థలాల కేటాయింపుపై దృష్టిసారించింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 25వేల పైబడి అర్చకుల కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్లు దేవదాయశాఖ వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆదాయం లేని ఆలయాలకు దూపధీప నైవేద్య పథకం కింది నెలవారీ నిధులు అందజేయడం..అర్చకుల వేతనాల పెంపు..వారసత్వపు హక్కు పునరుద్ధరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పదవీ విరమణ లేకుండా ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో వివిధ వర్గాలను ప్రత్యక్షంగా కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అర్చకుల ఇబ్బందులను గమనించిన వైఎస్‌ జగన్మోహన రెడ్డి..అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయవం సాధించిన తర్వాత వివిధ వర్గాల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాల్లో పని చేస్తున్న అర్చకుల సంక్షేమంపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించారు.

- Advertisement -

వారసత్వపు హక్కు పునరుద్ధరణ..

అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే వారసత్వపు హక్కును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని వేలాది ఆలయాల్లో వంశపారంపర్య అర్చకులు పని చేస్తున్నారు. గతంలో వీరికి వారసత్వపు హక్కును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వేలాది మంది అర్చకులు ఉపాధి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక మార్లు పలువురు అర్చకులు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం. ఈ క్రమంలోనే జగన్మోహన రెడ్డి ప్రభుత్వం వారసత్వపు హక్కును పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయం అనేక కుటుంబాలకు మేలు చేసిందని చెప్పొచ్చు.

దీపధూప నైవేద్య పథకం..

రాష్ట్రంలోని వేలాది ఆలయాలకు కనీసం దూపధీప నైవేద్యాలకు సైతం ఆదాయం లేని పరిస్థితి ఉంది. స్థానికంగా భక్తులు, దాతలు ఇచ్చే అరకొర సాయంతో ఆలయాల నిర్వహణ జరుగుతోంది. ఓ వైపు ఆలయ రోజువారి నిర్వహణకే నిధులు లేని క్రమంలో అర్చకుల పరిస్థితి మరింత దయనీయమని చెప్పొచ్చు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానానికి స్వస్తి పలికింది. జిల్లా దేవదాయశాఖ అధికారుల సిఫారసులతో దీపధూప నైవేద్య పథకం(డీడీఎన్‌ఎస్‌) కింద నెలకు రూ.5వేలు ఇస్తోంది. ఇప్పటి వరకు 4,600 వరకు ఆలయాలకు డీడీఎన్‌ఎస్‌ పథకం కింద రూ.5వేలు నెలకు ఇస్తున్నారు. ఇందులో రూ.2వేల వరకు ఆలయాల రోజువారీ ఖర్చులు పోను మిగిలిన మొత్తానలు అర్చకులు జీతాలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అర్చకులకు ఎంతోకొంత ఆర్థిక వెసులుబాటు దొరికిందని చెప్పొచ్చు. ఓ వైపు ప్రభుత్వపరంగా సాయం..మరో వైపు భక్తులు, దాతలు ఇచ్చే కొద్దిపాటి విరాళాలతో ఇప్పుడు పరిస్థితి బాగుందని పలువురు అర్చకులు పేర్కొంటున్నారు.

జీతం కూడా పెంపు..

రాష్ట్రంలోని ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చకులకు పదవీ ఉద్యోగ, ఆర్థిక భద్రతతో పాటు ఇంటి స్థలం కూడా కేటాయించనున్నారు. పదవీ విరమణ లేకుండా తొందరలోనే ఉత్తర్వులు వెలువరించనున్నారు. గతం నుంచి వయస్సు పైబడిన అర్చకులకు పదవీ విరమణ వర్తింప చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఆలయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమను పదవీ విరమణ పేరిట బయటకు పంపడం సరికాదంటూ ఎప్పటి నుంచో అర్చకులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనేక సందర్భాల్లో వివిధ అర్చక సంఘాలు కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పదవీ విరమణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో వారికిచ్చే వేతనాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఆలయాల స్థాయిని బట్టి కనిష్టంగా రూ.10వేలు, గరిష్టంగా రూ.15,625 వేతనంగా నిర్ణయించనున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు దేవదాయశాఖ చెపుతోంది. అర్చకులకు ఉద్యోగ, ఆర్థిక భద్రతతో పాటు ఇంటి స్థలం కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. విధులు నిర్వహిస్తున్న ఆలయాలకు సమీపంలో ఇంటి స్థలం కేటాయిస్తారు. తద్వారా అన్ని రకాలుగా అర్చకులకు వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement