Thursday, May 2, 2024

Big Story: ‘కళ’వాడుతున్న గన్నవరం విమానాశ్రయం.. పేరుకే అంతర్జాతీయం.. తగ్గుతున్న సర్వీసులు

అమరావతి, ఆంధ్రప్రభ : ఒక వెలుగు వెలిగిన గన్నవరం విమానాశ్రయం ఇప్పుడు ‘కళ’వాడుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను దక్కించుకున్నప్పటికీ, ఆమేర సర్వీసులు ఏమాత్రం నడవని పరిస్థితి నెలకొన్నది. పేరుకు ఒకట్రెండు అంతర్జాతీయ సర్వీసులు …. అది కూడా అడపాదడపా మాత్రమే నడుస్తూ ఉన్నాయి. స్థాయికి తగ్గ సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని చవిచూస్తున్నారు. గతంలో సింగపూర్‌తో పాటు అరబ్‌ దేశాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులు నేరుగా నడిచేవి. దీంతో విదేశాలకు వెళ్లే ప్రయాణీకులు నేరుగా ప్రయాణించే వెలుసుబాటు కలిగింది. ఆతర్వాత పరిణామాల్లో అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.

అయితే తాజాగా షార్జాకు ఒక సర్వీసును విమానాయాన సంస్థ ప్రారంభించింది. ఈ సర్వీస్‌ కూడా కేవలం వారంలో రెండ్రోజులు మాత్రమే నడవనుంది. ఇదే సమయంలో కువైట్‌ నుంచి ఒక ఎరైవల్‌ ఫ్లైట్‌ మాత్రమే గన్నవరం విమానాశ్రయానికి వారంలో ఒక్కసారి వస్తుంది. గతంలో వారానికి ఐదు సర్వీసులు నడిస్తే ఇప్పుడు వారానికి రెండు విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులపై విమానాశ్రయ అధికారులు పూర్తి దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు ఉన్నాయి. అంతర్జాతీయ సర్వీసులకు అవసరమైన అన్ని హంగులు, వసతులు ఉన్నప్పటికీ విమనాలను అందుబాటులోకి తేకపోవడం వల్ల పొరుగురాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్‌, అరబ్‌ దేశాలతో పాటు మలేషియా, బ్యాంకాక్‌లకు సర్వీసులు నడిపినట్లయితే విమానయాన సంస్థకు ఆదాయం సమకూరడంతో పాటు మరిన్ని ఎయిర్‌వేస్‌ సంస్థలు తమ సర్వీసులు నడిపేందుకు ముందుకు వస్తాయని ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విమానయాన సంస్థ దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

తగ్గిపోయిన దేశీయ సర్వీసులు..

ఇదిలావుంటే, గన్నవరం నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే దేశీయ సర్వీసులు కూడా తగ్గిపోయాయి. గతంలో వివిధ ప్రాంతాలకు 24 గంటలు విమాన సర్వీసులు అందుబాటులో ఉండేవి. విజయవాడ – హైదరాబాద్‌, విజయవాడ – ముంబై, విజయవాడ – ఢిల్లి, విజయవాడ – వారణాసి, విజయవాడ – బెంగళూరు సర్వీసులు అధికంగా నడిచేవి. అయితే ఈ ప్రస్తుతం ఈ సర్వీసులు అరకొరగానే నడుస్తున్నాయి. గతంలో విజయవాడ – హైదరాబాద్‌కు 8 నుంచి 9 సర్వీసులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య సగానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో బెంగళూరుకు 4 సర్వీసులు గతంలో ఉండగా, ఇప్పుడు కేవలం రెండు సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఇక ముంబై సర్వీస్‌ పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ఢిల్లికి నడిచే సర్వీసులు కూడా బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం గన్నవరం నుంచి ఉదయం ఒక సర్వీస్‌, రాత్రి మరో సర్వీస్‌ మాత్రమే ఢిల్లికి నడుస్తున్నాయి. ఇక వారణాసి సర్వీస్‌ను పూర్తిగా నిలిపివేశారు.

ఎక్కువగా విజయవాడ విమానాశ్రయం నుంచి స్పైస్‌జెట్‌ సర్వీసులు నడిచేవి. ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితిలో సర్వీసులను పరిమితం చేసింది. మరోవైపు గతంలో ట్రూజెట్‌ సంస్థ కడప – విజయవాడ మధ్య సర్వీసులు నడిపినప్పటికీ ఆ తర్వాత దీన్ని రద్దు చేసింది. ప్రయాణీకుల సం ఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ సర్వీసులు తగ్గిపోవడం శోచనీయం. అయితే మళ్లి ఈ సర్వీసులను పునరుద్ధరించే దిశగా గన్నవరం విమానాశ్రయ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే విమానాయాన సంస్థలతో మాట్లాడి సర్వీసులను పెంచే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఢిల్లికి వెళ్లే ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మరో సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement