Sunday, May 5, 2024

ఐదేళ్ల ఫీజు చెల్లించాల్సిందే.. వైద్య విద్యార్థులకు స్పష్టతనిచ్చిన వైస్‌ చాన్స్‌లర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: వైద్య విద్యార్థులు జీవో నెంబర్‌ 31 ప్రకారం 2019కి పూర్వం చేరిన వాళ్లు ఐదేళ్ళ ఫీజును చెల్లించాల్సిందేనని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సిలర్‌ శ్యామ్‌ప్రసాద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2020లో ప్రభుత్వం జీవో నెంబర్‌ 146ను జారీ చేసిందని దీని ప్రకారం నాలుగున్నర సంవత్సరాల ఫీజును మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. పాత, కొత్త జీవోల నేపథ్యంలో కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జీవో 31 ప్రకారం మెడిసిన్‌ విద్యార్థులు ఏ కేటగిరిలో రూ.10 వేలు, బీ కేటగిరిలో రూ.11 లక్షల చొప్పున, సి కేటగిరిలో రూ.55 లక్షల చొప్పున ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ప్రతి ఏడాది ఐదు శాతం చొప్పున ఫీజుల పెంపు ఉంటుందన్నారు. జీవో 146 ప్రకారం ఏ కేటగిరిలో రూ.15 వేలు, బి.కేటగిరిలో రూ.12 లక్షలు, సి.కేటగిరిలో రూ.36 లక్షల చొప్పున ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందులో ప్రతి సంవత్సరం ఎలాంటి పెరుగుదల ఉండదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాలను అర్థం చేసుకొని కళాశాలల యాజమాన్యాలకు సహకరించాల్సిందిగా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ప్రైవేటు కళాశాలలు ఫీజుల్ని వసూలు చేయాలన్నారు.

పెరగనున్న పీజీ సీట్లు..

వైద్యవిద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు సంబంధించి ఈ ఏడాది 400 నుంచి 600 వరకు సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఎంతమేర సీట్లు పెరుగుతాయన్న విషయం ఈనెల 15 తరువాత స్పష్టత వస్తోందన్నారు. ఇప్పటి వరకు పీజీ సీట్ల కోసం నిబంధనలకు అనుగుణంగా 4,703 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటి పరిశీలన పూర్తయిందని, ఈనెల మూడో వారంలో కౌన్సిలింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. వైద్య కళాశాలల్లో ర్యాంగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కళాశాల్లోనూ యాంటీ ర్యాగింగ్‌ కమిటీతో పాటు జనరల్‌ హెరాస్‌మెంట్‌ కమిటీ కూడా ఉంటుందన్నారు. ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదురైనా విద్యార్థులు ధైర్యంగా ఈ కమిటీ దృష్టికి తమ సమస్యను తీసుకురావచ్చన్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement