Sunday, April 28, 2024

AP: జ‌గ‌న్ అనంత సభకు అంతా సిద్ధం … భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ‌లో నేత‌లు

అనంతపురం బ్యూరో, ప్రభ న్యూస్: ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న సిద్ధం సభకు సర్వ సన్నద్ధమైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో రాయల సీమ జిల్లాల నుంచి పది లక్షల మందికి కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. పూర్వపు కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి జనం వస్తుండడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సభాస్థలికి మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో నుంచి 200 బస్సులను ఏర్పాటు చేశారు. సభకు వస్తున్న జనం కోసం బిర్యాని ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు, టోపీలు ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. ప్రతి తమకు అప్పగించిన బాధ్యతను ప్రతీ ఎమ్మెల్యే దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం సభ ప్రాంతం రాప్తాడు నియోజకవర్గ మండల కేంద్రం కావడంతో పాటు ఆటోనగర్ సమీపంలో ఏర్పాటు చేశారు. బెంగళూరు హైదరాబాద్ 44వ నెంబర్ జాతీయ రహదారి చెన్నై బళ్లారి 42వ నంబర్ జాతీయ రహదారులు ఈ ప్రాంతం నుంచి వెళ్తాయి. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

భారీ గూడ్స్ వాహనాలు మినహా మిగితా అన్ని రకాల వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, అత్యవసర వాహనాలు యథావిధిగానే అనంతపురం మీదుగా హైవే-44 పై వెళ్ళవచ్చని ఎస్పి అన్బురాజన్ ప్రకటించారు. ఈ ఆంక్షలు కేవలం భారీ గూడ్స్ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయన్నారు. మిగితా అన్ని రకాల వాహనాలు, అత్యవసర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు యథావిధిగానే అనంతపురం మీదుగానే హైవే-44 పై వెళ్లవచ్చన్నారు. ప్రజలు, వాహనచోదకులు అసౌకర్యానికి గురికాకుండా ఆంక్షలు సవరించామని పోలీసులతో సహకరించాలని ఆయన తెలియజేశారు.

- Advertisement -

చెన్నై, కదిరి వైపు నుండీ వయా ఫంగల్ రోడ్డు మీదుగా జాతీయ రహదారి-44 పై హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలు బత్తలపల్లి వద్ద మళ్లించారు. బత్తలపల్లి నుండీ నార్పల, బుక్కరాయసముద్రం, ఎన్టీఆర్ మార్గ్, గుత్తిరోడ్డు, తడకలేరు, సోములదొడ్డి వద్ద జాతీయ రహదారి-44 మీదుగా వెళ్లాలి. హైదరాబాద్ నుండీ వయా అనంతపురం మీదుగా కదిరి, చెన్నై వైపు వెళ్లాల్సిన వాహనాలు సోములదొడ్డి వద్ద డైవర్షన్ చేశారు. సోములదొడ్డి నుండీ తడకలేరు, గుత్తిరోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, బుక్కరాయసముద్రం, నార్పల, బత్తలపల్లిల మీదుగా వెళ్లాలి . వాహనాల రాకపోకల మళ్లింపు ప్రారంభపు ప్రదేశాలలో “ట్రాఫిక్ డైవర్షన్” వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. వాహనాల డ్రైవర్లు గమనించి ఫ్లెక్సీలలో సూచించిన ప్రకారం ఆయా రహదారులపై వెళ్లాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement