Friday, April 26, 2024

పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు.. సీఎం జ‌గ‌న్

తాడేపల్లి: పోలీస్‌ శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామ‌ని, పోలీసులు మీ స్నేహితులు అనే భావన తీసుకురాగలిగామ‌ని, పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేశామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామ‌న్నారు. పోలీస్‌ శాఖలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా, గతానికి భిన్నంగా ఎన్నెన్నో మంచి సంస్కరణలు అమలవుతున్నాయన్నారు. ఎప్పుడూ చూడని విధంగా గ్రామస్థాయిలోనే మహిళా పోలీసులు సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చారన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామ‌న్నారు. పోలీస్‌ స్టేషన్లలోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రవర్తించే తీరు, రిసెప్షన్‌ గతానికి, ఇప్పటికీ విపరీతమైన తేడా కనిపించేలా.. పోలీసులు మీ స్నేహితులు అని చెప్పే భావన కల్పిస్తూ రిసెప్షనిస్టులను కూడా నియమించామ‌న్నారు.

ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారికి తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా దిశ యాప్‌ను 1.20 కోట్ల పైచిలుకు మంది డౌన్‌లోడ్‌ చేసుకొని రిజిస్ట్రర్‌ అయ్యారన్నారు. సెల్‌ఫోన్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే పోలీసులు, ప్రభుత్వమే మీకు అన్నగా, తమ్ముడిగా ఉంటుందనే భరోసా కల్పించామ‌న్నారు. ఆపదలో ఉన్నప్పుడు 5సార్లు ఫోన్‌ షేక్‌చేసినా, ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా 10 నిమిషాల్లోపే పోలీసులు ఆ మహిళ దగ్గరికి చేరుకుంటారన్నారు. ఎస్‌ఓఎస్‌ లేదా ఫోన్‌ షేక్‌ చేసిన 5–10 సెక్షన్ల వ్యవధిలో పోలీసుల నుంచి ఆ మహిళకు ఫోన్‌ వెళ్తుందన్నారు. ఫోన్‌ రిప్లయ్‌ చేయకపోతే వెంటనే ఆ స్థలానికి వెళ్లి తోడుగా నిలబడుతున్నారన్నారు. ఇలా దాదాపు 6 వేల మందికి మంచి జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పోలీస్‌ శాఖలో మార్పులు కనిపిస్తున్నాయన్నారు. పోలీస్‌ శాఖలో సంస్కరణల్లో భాగంగా 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా దాదాపు 20 లొకేషన్లను గుర్తించి, ఆ ప్రదేశాల్లో కియాస్క్‌లను పెట్టి, ఆ ప్రదేశాల్లో పెట్టిన కియాస్క్‌లు స్థానిక పోలీస్‌స్టేషన్లతో అనుసంధానమై ఉన్నాయన్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్లకు 20 అదనపు పోలీస్‌స్టేషన్లుగా పర్యాటక ప్రాంతాల్లో స్టేషన్లు పనిచేస్తాయన్నారు. ప్రతి కియాస్క్‌లో దాదాపు 6మంది సిబ్బంది, అందులో 8 గంటల షిఫ్ట్‌లో ఇద్దరు, 12 గంటల షిఫ్ట్‌ డ్యూటీలో ముగ్గురు పనిచేసే విధంగా రూపకల్పన చేశామ‌న్నారు. వీరిని పర్యవేక్షించేందుకు ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి అధికారిని నియమించామ‌న్నారు. వీరికి సంబంధించి ప్రత్యేకంగా టెలిఫోన్‌ నంబర్‌ కేటాయించాం. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే పోలీస్‌ సోదరుడు మీకు అండగా నిలబడినట్టే అనే భావన కల్పించేలా, దిశ యాప్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేయాలో చెప్పే కరపత్రాలను కియాస్క్‌లో అందుబాటులో ఉంచామ‌న్నారు. టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్లలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకమైన టెలిఫోన్‌ నంబర్, రేడియో సెట్, ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్, ఎమర్జెన్సీ టెలిఫోన్‌ నంబర్, వెహికిల్స్‌ అన్నీ ఇచ్చామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement