Sunday, May 5, 2024

మాన్సాస్ ట్రస్టుపై తీర్పు… అప్పీల్ కు వెళ్లనున్న ఏపీ ప్రభుత్వం

మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని నిన్న ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే, దీనిపై మళ్లీ అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మాన్సాస్ ట్రస్టు విషయంలో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళుతున్నామని చెప్పారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను గుర్తిస్తున్నామని, ప్రభుత్వ చర్యలతో భూఆక్రమణ దారులపై అందరికీ భయం పట్టుకుందన్నారు. మాన్సాస్ ట్రస్టు పరిధిలో అన్యాక్రాంతమైన భూములపైనా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. దేవాదాయ భూములను చంద్రబాబు నాడు పప్పుబెల్లాల్లా పంచారని ఆరోపించారు. దేవాదాయ భూములను సంరక్షించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా పనిచేసిన కాలంలో అశోక్ గజపతి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత నియామకాన్ని అశోక్ గజపతి రాజు జీర్ణించుకోలేకపోయారని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు.

కాగా, మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. సోమవారం(జూన్ 14) దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు… ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న తర్వాత త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. గ‌తంలో సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ ట్ర‌స్టుకు సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు ఛైర్మ‌న్‌గా ఉన్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement