Saturday, April 27, 2024

రైతన్నకు ఈదురుగాలుల దెబ్బ.. నేలకొరిగిన బొప్పాయి, అరటి తోటలు

గుంతకల్లు రూరల్‌, (అనంతపురం) ప్రభన్యూస్‌: ఉగాది చినుకులు కొంతమంది రైతుల కళ్లల్లో ఆనందం నింపితే పండ్ల తోటల రైతులకు మాత్రం కన్నీటిని మిగిల్చింది. లక్షలాది రూపాయలు పెట్టు-బడులు పెట్టి కంటిపాపలా కాపాడుకున్న చేతికందివచ్చిన పండ్ల తోటలను ఈదురుగాలులు, వర్షం రూపంలో దురదృష్టం రైతన్నను వెంటాడింది. శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులు, కురిసిన వర్షపు చినుకులు గుంతకల్లు మండలంలోని పలు గ్రామాల్లోని పండ్ల తోటల రైతులను నష్టాలపాలు చేశాయి. శనివారం మధ్యాహ్నం నుంచి అనుకోని రీతిలో వాతావరణంలో వచ్చిన మార్పులో భాగంగా సాయంత్రం నుంచి ఈదురుగాలులు వీచాయి. వీటికి తోడు మండల పరిధిలోని నాగసముద్రం, గుర్రబ్బాడు, కదిరిపల్లి, అయ్యవారిపల్లి గ్రామాల పరిధిలో బలమైన ఈదురుగాలులతో పాటు చిన్నపాటి వర్షం కురిసింది. ఈదురుగాలుల దెబ్బకు ఆయా గ్రామాలలోని పలువురు రైతులు సాగుచేసిన బొప్పాయి, అరటి చెట్లు నేలకూలాయి. సదరు గ్రామాలలో మొత్తం సుమారు 25 ఎకరాలలోని పండ్ల తోటలు నేలమట్టమయ్యాయి. కదిరిపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్‌ అనే రైతు తన 3 ఎకరాలలో సాగుచేసిన బొప్పాయి తోట ఈదురుగాలుల దెబ్బకు నేలకొరగడంతో చేతికందివచ్చిన పంట నష్టపోయానంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు.

అంతేగాకుండా నాగసముద్రం గ్రామంలోని హనుమంతురెడ్డి, సురేష్‌ అనే రైతులు సాగుచేసిన బొప్పాయి తోటలు, అదే గ్రామానికి చెందిన సూరి, గుర్రబ్బాడు గ్రామానికి చెందిన నెట్టికంటి, పెద్ద నెట్టికంటయ్య అనే రైతులకు చెందిన అరటి తోటలు నేలమట్టమయ్యాయి. వీటితో పాటు అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతుల బొప్పాయి మొక్కలు కూడా ఈదురుగాలులు, వర్షం దెబ్బకు నేలకొరిగి పూర్తిగా పంట నష్టపోయినట్లు పేర్కొన్నారు. రైతులు మాట్లాడుతూ బొప్పాయి సాగుకు ఎకరాకు రూ.1.50లక్షకు పైగా పెట్టుబడులు పెట్టి సాగుచేశామని వాపోయారు. మరో 20 రోజుల్లో పంట చేతికందివస్తుందని దీంతో ఎకరాకు సగటున రూ.4లక్షల మేర ఆదాయం వచ్చేదని కన్నీటి పర్యంతమయ్యారు. అదేవిధంగా ఎకరాకు సుమారు రూ.40వేలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన అరటి పంట మరో వారం రోజుల్లో కోతకోయాల్సి ఉండగా వాయుదేవుడు చిన్నచూపు చూశాడంటూ అరటితోటల రైతులు వాపోయారు. వీటితో పాటు ఆముదం, మొక్కజొన్న తదితర పంటలు కూడా నష్టపోయినట్లు ఆయా గ్రామాల రైతులు పేర్కొన్నారు. పండ్లతోటల నష్టంపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాము – అపర్ణ, ఉద్యానవనశాఖ అధికారి గుంతకల్లు మండల పరిధిలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలుల దెబ్బకు పలు గ్రామాలలో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పండ్ల తోటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం నిమిత్తం నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతామని గుంతకల్లు నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి అపర్ణ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement