Friday, April 19, 2024

కాంగ్రెస్సా, బీజేపీనా?.. కొండా దంపతుల అడుగులు ఎటు వైపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గత ఎన్నికల పరాజయాలను భేరీజు వేసుకుంటున్న బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ఎంపికపై ఆచీ తూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో బలమైన నేతను, అతని వెనుక ఉన్న క్యాడర్‌ను పరిగణలోకి తీసుకొని పార్టీలోకి ఆహ్వానించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బీజేపీ నేత ఇటీవల మాజీ మంత్రివర్యులు కొండా సురేఖ, మురళి దంపతులతో సమావేశమై సంప్రదింపులు జరుపుతున్నారనే చర్చ కొనసాగుతోంది. కొండా దంపతులు బీజేపీలో చేరినట్లయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పాగా చేయవచ్చని భావిస్తోందని తెలుస్తోంది. వారికి రెండు అసెంబ్లి స్థానాలను కేటాయిస్తామని ఆఫర్‌ చేసినట్లు సమాచారం.
విద్యార్థి దశ నుంచి కొండాకు ఉన్న ఉద్యమ చరిత్ర, ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా సేవలందించిన సురేఖ ప్రాముఖ్యతలను ప్రామాణికంగా తీసుకుని వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు పాచికలు కదుపుతున్నట్లు సమాచారం. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎంపీపీ నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిచిన సురేఖ మంత్రిగా కూడా పదవిలో కొనసాగారు. విద్యార్థి దశలోనే కొండా ప్రాముఖ్యతను, మంత్రిగా ఎదిగిన కొండా సురేఖ ప్రాధాన్యతను పరిశీలించిన బీజేపీ అధిష్టానం వారిని బిజెపిలోకి ఆహ్వానిస్తున్నట్లు కొండా దంపతుల అభిమానుల నుంచి తెలియవస్తుంది. కాగా వచ్చే అసెంబ్లి ఎన్నికలలో రాజకీయ సమీకరణలు పూర్తి స్థాయిలో మారే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement