Sunday, May 5, 2024

డీఆర్‌డీఏ ఇక ఉండ‌దు ఎందుకంటే..

ఒంగోలు, (ప్రభన్యూస్‌): గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఏ)కు కేంద్రం మంగళం పాడనుంది. సంస్థ నిర్వహణకు నిధులు నిలిపివేస్తున్నట్లు రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో డిఆర్‌డిఏలో పని చేస్తున్న సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా అమలు చేసే పలు సంక్షేమ పథకాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకుంటూ.. అవి క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చూడటం డిఆర్‌డిఏ బాధ్యత.

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డిఏ)కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1999 ఏప్రిల్‌ 1న అప్పటి కేంద్ర ప్రభుత్వం డీఆర్‌ డిఏను ప్రారంభించింది. అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో డీఆర్‌డిఏ కీలక పాత్ర పోషిస్తోంది. అనుబంధ శాఖల సహకారంతో పని చేస్తోంది. ఇందులో వందలాది మంది సిబ్బంది కాంట్రాక్టు, తాత్కాలిక, డిప్యూటేషన్ల పద్దతిలో పని చేస్తున్నారు. జిల్లాలో లక్షలాది మంది గ్రామీణ మహిళలు పొదులు సంఘాల కార్యక్రమాలతో పాటు, పింఛన్ల పంపిణీ వంటి పథకాలను ఈ కార్యలయం పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పని చేసే డిఆర్‌డిఏల నిర్వహణ, సిబ్బంది జీతాల నిధులను కేంద్రమే ఇస్తోంది. ఈ నిధులను వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి నిలిపివేయడంతో పాటు, డిఆర్‌డిఏ సంస్థను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.

దీంతో ఈ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న ఈ ఉద్యోగులను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలోనే వివిధ విభాగాల్లో వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించడంతో పాటు అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరుతూ ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిసింది. అయితే, డిఆర్‌డిఏను రద్దు చేసి అక్కడ పని చేసే ఉద్యోగులను జిల్లా పరిషత్‌ లేదా పంచాయతీల్లో విలీనం చేయాలని రాష్ట్రాలకు సూచింది. ప్రస్తుతం డిఆర్‌డిఏ రాష్ట్ర డైరెక్టరేట్‌, రీజియన్‌, జిల్లా, బ్లాకులుగా పని చేస్తోంది. ఈ పథకం కింద పని చేసే సిబ్బంది జీతాలు, గ్రామాల అభివృద్ధికి 75:25 నిష్పత్తిలో నిధులు విడుదల అవుతున్నాయి. డీఆర్‌డిఏకు నేరుగా కేంద్రం నిధులు జమ చేస్తుంటుంది.

ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలను డీఆర్‌ డిఏ చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ ఈ సంస్థ పని చేస్తుంది. డిఆర్‌డిఏ పరిధిలో ఉన్న పీడీ, ఏపీడీలు, ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, సూపర్‌వైజర్లు, కార్యాలయ సిబ్బంది వివిధ శాఖల పరిధి నుంచి వచ్చి డిప్యూటేషన్‌ పై పని చేస్తున్నారు. వీరందరినీ మాతృసంస్థలకు, లేదా జిల్లా పరిషత్‌, జిల్లా పంచాయతీలు, జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ విభాగం, ఉపాధిహామీ పథకం, ప్రధాన మంత్రి అవాస్‌ యోజన, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో సర్దుబాటు చేయాలని ఆదేశించింది.

దీంతో జిల్లాలో డిఆర్‌ డిఏలో పని చేస్తున్న సిబ్బందిని సిఫారసు చేసిన శాఖల్లోకి బదలాయించనున్నట్లు తెలుస్తోంది. డీఆర్‌డిఏలో ఆ స్థాయిలో పని చేస్తున్న సిబ్బందిని వారి స్థాయిని బట్టి ఉద్యోగాల్లో నియమిస్తారా..? లేదంటే కేడర్‌ కు తగ్గనుందా..? అనే దాని పై విస్తృత చర్చ జరుగుతోంది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎవరి ఉద్యోగాలు ఉంటాయి..? ఎవరివి ఊడిపోతాయోనన్న ఆందోళన ఉద్యోగులు, సిబ్బందిని వెంటాడుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement