Sunday, April 28, 2024

Dollars Dream – భార‌తీయ విధ్యార్ధులు తిరుగు టపా…

హైదరాబాద్‌/ అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: కోటి ఆశలతో అమెరికాలో చదువుకునేందుకు అక్కడి వెళ్లిన తెలుగు విద్యార్థు లను అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెనక్కి పంపేశారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లలో దిగిన వెంటనే విద్యార్థులను ఆపి చెక్‌ చేసిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పత్రాలు సక్రమంగా లేవంటూ వెంటనే ఉన్న ఎయిర్‌ ఇండియా విమానంలో వెనక్కి పంపించేశారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారత విద్యార్థుల్లో రెండు వేల మందిని తిరిగి పంపించి వేయగా ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు వందల మంది ఉన్నట్టు- తెలు స్తోంది. తెలంగాణా నుంచి ఈ రెండు నెలల్లో 25 వేల మంది అమెరికా వెళ్లగా గతవారం రోజుల్లో రెండు వందల మందిని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెనక్కి పంపినట్టు- సమాచారం. విద్యార్థులు అట్లాం టా, చికాకో, శాన్‌ ప్రాన్సిస్కో ఎయిర్‌ పోర్టుల్లో దిగిన వెంటనే ఇమ్మిగ్రేషన్‌ అధికా రులు వారిని ప్రశ్నించారు. మీ ఫోన్‌ చూడవచ్చా అని అడిగారు. విద్యార్థుల ఇంగ్లీష్‌ భాషా ప్రావీణ్యంపైన అనుమానాలు వ్యక్తం చేశారు.

మీ తల్లితండ్రుల ఆదాయ వివరాలు ఏంటీ, మీ ఖాతాలో ఎన్ని డాలర్లు ఉన్నాయి అనే ప్రశ్నలు అడి గారు. విద్యార్థుల విద్యార్హతల గురించి, వీసా ఇంటర్వ్యూ గురించి, కన్సెల్టెన్సీల సహాయం గురించి వివరాలు అడిగారు. చివరిగా సరైన డాక్యుమెంట్లు లేవని, సరైన విధంగా నిబంధనలు పాటించలేదనే కారణంగా వారి వీసాను రద్దు చేసి, వారి కాలేజీల అడ్మిషన్‌ను కూడా క్యాన్సిల్‌ చేశారు. అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు భారతీయ విద్యార్ధులకు చెందిన ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను, సోషల్‌ మీడియా అకౌంట్లను తనిఖీ చేసి వెంటనే వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ఈలోపు కాసేపు విద్యార్థులను ఇరుకు గదిలో బంధించారు. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని, కాలేజీల అడ్మిషన్‌ లేఖలు ఉన్నాయని విద్యార్థులు గట్టిగా అడగబోగా ఇంకా గోల చేస్తే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి తిరిగి ఫ్లెట్‌ ఎక్కించి పంపించేశారు. ఒక్కసారి యూఎస్‌ నుండి డిపోర్ట్‌ అయిన విద్యార్థులకు ఐదేళ్ల పాటు వీసా దొరకని స్థితి ఉంది. దీంతో తల్లితండ్రులు, విద్యార్థులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. తమ సమయం, డబ్బు వృధా అయ్యిందని విలపిస్తున్నారు. తిరిగి వచ్చిన విద్యార్థుల పరిస్థితిపై భారత ఇమ్మిగ్రేషన్‌ అధికారుల విచారణ చేపట్టారు. ఢిల్లిd అంతర్జాతీయ విమానశ్రయంలోనే వీరంతా ఎందుకు వెనక్కి వచ్చారా? అని ప్రశ్నించారు. ఏవైనా తప్పుడు డాక్యుమెంట్లు పెట్టారా? అని ఆరా తీస్తున్నారు.

విద్యార్థుల్లో 20శాతం భారతీయులే
ఇటీవల కాలంలో భారత్‌ నుండి అమెరికాకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య మరీ పెరిగింది. అమెరికాలో ఉన్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 20 శాతం మంది ఒక్క భారత్‌ నుండే ఉన్నారు. గత ఏడాది అత్యధికంగా లక్షా 25 వేల మంది విద్యార్థి వీసాలను మంజూరు చేశారు. భారత్‌ నుండి వెళ్లే విద్యార్థుల్లో దాదాపు 25 శాతం మంది తెలుగు విద్యార్థులే ఉంటున్నారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో తెలుగు విద్యార్ధులు అమెరికాకు వెళ్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల నుంచి పల్లెటూళ్లతోపాటు పట్టణాల నుండి ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు విదేశాలకు చదవుకు వెళ్తుతున్న పరిస్థితి ఉంది.

కన్సెల్టెన్సీల మాయాజాలం
విదేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో చదవాలని తెలుగు విద్యార్థుల్లో రోజు రోజుకు పెరుగుతున్న మోజును క్యాష్‌ చేసుకునేందుకు వివిధ కన్సెల్టేన్సీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. అమెరికాలో ప్రముఖ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థుల గురించి ఇమ్మిగేషన్‌ అధికారులు పెద్దగా దృష్టి పెట్టడడం లేదు. వారి పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి మాత్రం పంపించేస్తున్నారు. అయితే చిన్న చిన్న కాలేజీల్లో ఫీజులు తక్కువగా ఉండే కాలేజీల్లో సీట్లు పొంది చదువుల్లో పెద్దగా రాణించని, మార్కుల శాతం ఎక్కువగా లేని విద్యార్థులపై ఇమ్మిగ్రేషన్‌ అధికారులు దృష్టి పెడుతున్నారు. కన్సెల్టెన్సీలు తమ ఫీజుల కోసం విద్యార్థులకు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టిస్తున్నాయి. ఐఎల్‌టిఎస్‌, టోఫెల్‌, జీఆర్‌ఈ లాంటి పరీక్షలను వేరే వారి చేత రాయించి మరొక విద్యార్థికి సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. తీరా అమెరికా వెళ్లిన తర్వాత స్థానికులతో మాట్లాడేందుకు వీరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి సంఘటనలోనూ ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అదే అనుమానం వచ్చింది. సాటి అమెరికా విద్యార్థులతో భారతీయ విద్యార్ధులు మాట్లాడుతున్న తీరును గమనించిన అధికారులు వారిని ఆపి చెక్‌ చేశారు. మరో వైపున ఆర్థిక పరిస్థితిపైన కూడా తప్పుడు పత్రాలు పెడుతున్నారు. ఎవరైనా విద్యార్థి అమెరికా వెళ్లాలంటే కొంత మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్‌గా చూపించాలి. అయితే కన్సెల్టేన్సీలే వడ్డీ వసూలు చేస్తూ ఈ అమెంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో వాస్తవానికి విద్యార్థుల తల్లితండ్రులకు అంత ఆర్థిక స్థోమత లేకున్నా కన్సెల్టెన్సీల సహాయంలో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పటి ఘటనలో వెనక్కి పంపించిన వారిలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. కొన్ని కన్సెల్టెన్సీలు గుర్తింపు లేని కాలేజీలకు సీటు అలాట్‌ చేసి పంపిస్తున్నాయి. దీని కారణంగా కూడా విద్యార్థులు వెనక్కి వస్తున్నారు. మొత్తంగా కన్సెల్టెన్సీల మాయాజాలానికి విద్యార్థులు బలౌతున్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి వెనక్కి పంపించిన తెలుగు విద్యార్థులు ప్రభుత్వ అధికారులచుట్టూ తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తమకు న్యాయం చేయిం చాలని అడుగుతున్నారు.

ఇక్కడా ఉద్యోగాలు రావు
అమెరికా నుండి వెనక్కి పంపిన విద్యార్థులు భవిష్యత్‌లో అన్ని కష్టాలే వెంటాడనున్నాయి. ఇప్పటికే వీరు ఈ ఏడాదంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్థతి. స్థానికంగా ఈ ఏడాది ఎక్కడా అడ్మిషన్‌ తీసుకుందామన్నా అన్ని చోట్లా ఇప్పటికే అడ్మిషన్లు దాదాపు పూర్తయ్యాయి. వీరు అమెరికా కాలేజీలకు కట్టిన డబ్బు, చార్జీలకు పెట్టిన ఖర్చులు, కన్సెల్టెన్సీలకు చెల్లించిన ఫీజులు కూడా వృధా అయిపోతాయి. వీటన్నింటికీ మించి భవిష్యత్తులో వీరు భారత్‌లో ఉద్యోగాలు చేసుకోవాలన్న ఇబ్బందే. భారత్‌లో ఉండే ఐటీ కంపెనీలు సైతం వీరి పాస్‌పోర్టును చెక్‌ చేస్తాయి. అందులో డిపోర్టెట్‌ అని ఉంటే వీరికి ఉద్యోగాలు కూడా దొరకదు. వీటన్నింటినీ తలుచుకొని విద్యార్ధులు, తల్లితండ్రులు లబోదిబో మంటున్నారు.

జోక్యం చేసుకోనున్న కేంద్రం
అమెరికా వెళ్లిన భారత విద్యార్థులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరిగి విమానం ఎక్కించి స్వదేశానికి పంపిస్తున్న వైనంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏ కారణం చేత భారత విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారో ఆరా తీయాలని కేంద్ర విదేశాంగ శాఖ అమెరికాలోని భారత ఎంబసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు- సమాచారం.

- Advertisement -

విద్యార్థులను తిరిగి పంపడానికి కారణాలివే
తెలుగు రాష్ట్రాల్లో వీధివీధిన ఏర్పా-టైన కన్సల్టెన్సీలే కారణం అని భావిస్తున్నట్టు- సమాచారం. తామర తంపరగా ఏర్పా-టైన కన్సల్టెన్సీలు విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున సొమ్ము తీసుకుని నకిలీ అనుభవ పత్రాలు, బ్యాంకు స్టే-ట్‌మెంట్లు- ఇవ్వడం. అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లాలంటే జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌లో ఉత్తమ మార్కులను సాధించాల్సి ఉంటు-ంది. రెండు గంటల నలభై ఐదు నిముషాల పాటు- జరిగే ఈ పరీక్షలో 6.5 స్కోరును సాధిస్తే అత్యుత్తమ యూనివర్సిటీ-లో ప్రవేశం పొందే అవకాశం ఉంటు-ంది. అయితే మంచి స్కోరు సాధించేందుకు కన్సల్టెన్సీలు నకిలీ అభ్యర్థులతో ఈ పరీక్ష రాయిస్తున్న సంగతి అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు తెలిసింది.

అమెరికాలోని విమానాశ్రయాలలో దిగాక విద్యార్థులను అక్కడి ఎంబసీ అధికారులు మౌఖిక ఇంటర్వ్యూలు నిర్వహించగా సమాధానాలు ఇవ్వలేక బిక్క మొహం వేశారని తెలిసింది. జీఆర్‌ఈ, ఐఈఎల్‌ టీఎస్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడగ్గా నీళ్లు నమిలారని దీంతో అమెరికాకు వచ్చిన వాళ్లలో కొంతమంది స్వయంగా పరీక్షలు రాయుంచకుండా ఇతరులతో ఈ పని చేయించారన్నది అనుమానంగా భావిస్తున్నారు. ఇంజనీరింగ్‌, ఎంబీఏ వంటి కోర్సులను చదివాక రెండు మూడేళ్ళ పాటు- ఇక్కడ ఉద్యోగం చేసి ఆ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో అనుభవ పత్రాలను సమర్పించాల్సి ఉంటు-ంది. అయితే కొందరు నకిలీ అనుభవ పత్రాలను సమర్పించి వీసా పొందినట్టు- అనుమానిస్తున్నారు. అటు-వంటి అనుమానితులను తిరిగి విమానం ఎక్కించి వెనక్కి పంపారు.
వీసాకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు ఐదు యూనివర్సిటీ-లకు దరఖాస్తు చేస్తున్నారు. మొదటి మూడు వర్సిటీ-లు పేరొందినవి కాగా చివరి రెండు సాధారణమైనవి. ఇక్కడ కూడా విద్యార్థులు ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు దొరికిపోతున్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement