Saturday, April 27, 2024

Devotional – 6వ తేదీ నుంచి శ్రీశైలంలో ఉగాది మ‌హోత్స‌వాలు

శ్రీశైలంలో ఏప్రిల్ ఆరో తేది నుంచి పదో తేది వరకు ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆల‌య దేవస్థానం వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కర్నాటక, మహారాష్ట్ర పాదయాత్ర భక్త బృందాలతో ఈవో పెద్దిరాజు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు జరగబోయే మహోత్సవాల సమయంలో భక్తులందరికీ కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉండనున్నట్లు తెలిపారు. ఇక‌.. భక్తుల సందర్శనార్థం బుధ‌వారం నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు రోజుకు నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. స్వామివారి స్పర్శదర్శనం కోసం వెళ్లే భక్తులకు రూ.500 టిక్కెట్టును ఒక్కొక్క విడతలో 1500 టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రపరిధిలోని ఆలయంలోని ప్రదేశాలలో చలువపందిర్లు, మంచినీటి సౌకర్యం, శౌచాలయాలు, విద్యుత్‌ దీపాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

స్వ‌చ్చంద సేవ‌కుల‌కు పిలుపు

ఉగాది ఉత్సవాల సమయంలో కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను దేవస్థానం వినియోగించుకుంటుందని ఆల‌య‌ అధికారులు తెలిపారు. లాటరీ పద్ధతిలో స్వచ్ఛంద సేవా బృందాలకు ఆలయం, క్షేత్రపరిధిలోని ప్రదేశాలలో కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ స్వచ్ఛంద సేవకులు మార్చి 29 నుంచి ఏప్రిల్ పదో తేది వరకు ఈ సేవలను అందించాలన్నారు. స్వామివారి ఆలయం, ముఖ మండపం, నంది మండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం, ఉచిత క్యూ లైన్, భక్తులు దర్శనానికి వేచి ఉండే క్యూ కాంప్లెక్స్, పుష్కరిణి, గంగా భవానీ స్నాన ఘట్టాలు, పాతాళ గంగ, హఠకేశ్వరం, సాక్షి గణపతి, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, అన్నదానం, వైద్యశాల, వంటి తదితర ప్రాంతాల్లో సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement