Thursday, May 9, 2024

రైతులు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్న డిప్యూటీ సీఎం ధ‌ర్మాన‌

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఈ మేరకు న‌ర‌స‌న్న‌పేట‌ మార్కెట్‌ కమిటీ యార్డ్‌లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతులు ఎల్లప్పుడూ వరి సాగుచేస్తుంటారని, అయితే ఇంకా పలు ఉపకరణ పంటలైన మినుము, పెసర, వేరుశనగ, ఫామాయిల్‌ వంటి పంటలు సాగుచేసినట్లయితే మంచి దిగుబడులు వచ్చి రైతులు ఆర్ధికంగా పురోభివృద్ధి సాధించగలరన్నారు.

ఇటీవల నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో ఎంపికచేసిన పదవతరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు వ్యవసాయశాఖలో శిక్షణ ఇచ్చిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. అధికశాతం వరిపంట సాగుచేయడం కంటే, మిగిలిన అంతర పంటలపై రైతులు దృష్టి సారించినట్లయితే, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. అలాగే రైతులు కోళ్ల పెంపకంపై కూడా దృష్టి సారించాలని సూచించారు. రైతులు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటలను సాగుచేయాల్సిన అవసరముంద‌న్నారు. తానూ ఒక రైతుబిడ్డగా రైతాంగాన్ని ఎంతగానో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అందువల్ల వ్య‌వ‌సాయ‌దారుల కార్యక్రమానికి తప్పనిసరిగా తాను హాజరవ్వడం జరుగుతుందన్నారు.

జిల్లా వ్యవసాయ సహయమండలి సభ్యులు నేతాజి, మండల వ్యవసాయాధికారి, వ్యవసాయశాఖ సభ్యులుగా శిక్షణ పొంది రైతులకు పలు సూచ నలు, సలహాలు ఇస్తున్నారని, వాటిని రైతులు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్‌, స్థానిక సర్పంచ్‌ బురల్లి శంకరరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొన్నాన దాలినాయుడు, జ‌డ్పీటీసీ ప్రతినిధి చింతు రామారావు, పీఏసీఎస్ అధ్యక్షులు సురంగి నర్సింగరావు, తహశీల్దార్‌ ప్రవళ్లికాప్రియ, ప్రాదేశిక సభ్యురాలు అన్నపూర్ణరాజులు, పాగోటి అప్పారావు, ఆత్మా పిడి కృష్ణారావు, వ్యవసాయశాఖ ఎడి రవీంధ్రభారతి, ఆర్‌ఎం కోఆర్డినేటర్‌ కీర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మాగాణి పంటల విత్తనాలను మంత్రి చేతులమీదుగా పంపిణీ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement