Sunday, May 5, 2024

Big Story: విడి పాలకు మస్త్ గిరాకీ.. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో విడి పాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది . నిన్న మొన్నటి వరకు పల్లె ప్రాంతాలకే పరిమితమైన విడి పాలు అమ్మకాలు పట్టణ ప్రాంతాల్లో కూడా అమాంతంగా పెరగుతున్నాయి. నగర , పట్టణ ప్రాంతాల్లోని 15 శాతం మందికిపైగా ప్రజలు విడి పాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో విడిపాలకు గిరాకీ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు మహిళా రైతులు పట్టణ ప్రాంతాల్లోనే డెయిరీ ఫామ్‌లను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లోని కాలనీలు , అపార్టుమెంట్లలో విడి పాలను అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. శివారు ప్రాంతాల్లో డెయిరీ ఫామ్‌లను ఏర్పాటు చేసి ఉదయం , సాయంత్రం ఆయా ప్రాంతాల్లోని పట్టణ ప్రజలకు విడి పాలను అందిస్తున్నారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో విడి పాలకు మంచి డిమాండ్‌ ఏర్పడుతుంది. పట్టణ ప్రాజలు కూడా అత్యధిక శాతం మంది ఆ తరహా పాలను ఉపయోగించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పలువురు మహిళలు కూడా పాల వ్యాపారం పట్ల మక్కువ చూపుతూ తమ ఆర్థిక స్థితిగతులను మరింత మెరుగుపరుచుకునేందుకు విడిపాల వ్యాపారాన్నే వేదికగా చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో రోజుకు 3 లక్షల లీటర్లకు పైగా విడి పాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారంటే .. పట్టణ ప్రాంతాల్లో విడిపాల అమ్మకాలు ఏ స్థాయిలో సాగుతున్నయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హోటళ్లు , టీ దుకాణాల్లో అయితే సుమారు పది లక్షల లీటర్లకు పైగా విడి పాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటు ప్రజలు , అటు వ్యాపారులు విడి పాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుండడంతో మహిళా రైతులు అత్యధిక స్థాయిలో పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు.

నగర , పట్టణాల్లో .. కొనుగోలుకు మరింత ఆసక్తి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం , ప్రైవేట్‌ పాల డెయిరీలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా వివిధ రకాల నాణ్యమైన పాల ప్యాకెట్లు పట్టణ ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాల వరకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాయి. అయినా మారిన జీవనశైలితో పలువురు విడి పాల వైపు ఆకస్తి చూపుతున్నారు. అత్యధికంగా పట్టణ ప్రాంత ప్రజలు ఇళ్ల వద్దకు వచ్చి పాలు పితికి ఇచ్చే విధానానికే అలవాటు పడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, నగరాల్లో విడి పాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరగుతోంది. విజయవాడ , గుంటూరు , విశాఖపట్నం , ఒంగోలు , నెల్లూరు , తిరుపతి , ఏలూరు , రాజమండ్రి , కాకినాడ వంటి ప్రధాన నగరాలతో పాటు ఆయా జిల్లాల పరిధిలోని ప్రధాన పట్టణాల్లోనూ విడి పాలను కొనుగోలు చేసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాల వ్యాపారులు కూడా ఆయా ప్రాంతాలకు సమీపంలోనే డెయిరీ ఫామ్‌లను ఏర్పాటు చేసి రెండు పూట్ల విడి పాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఒక్కో పట్టణ ప్రాంతంలో రోజుకు 10 వేల లీటర్లకు పైగా విడిపాల అమ్మకాలు సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే లక్షల లీటర్లు విక్రయాలు జరుగుతున్నాయి.

శివారుల్లో పెరుగుతున్న డెయిరీ ఫామ్‌లు

- Advertisement -

పట్టణ ప్రజలు అత్యధిక శాతం మంది విడిపాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో శివారు ప్రాంతాల్లో డెయిరీ ఫామ్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నిరుపేద మహిళలు అత్యధిక శాతం మంది విడి పాల వ్యాపారాన్నే జీవనోపాధిగా మార్చుకుంటున్నారు. ఉదాహరణకు నెల్లూరు నగర పరిధిలో నిత్యం 5 వేల లీటర్లకు పైగా విడిపాల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో నగర శివారు ప్రాంతాలైన సుందరయ్య కాలనీ , పడారుపల్లి , బుజబుజనెల్లూరు, తదితర ప్రాంతాల్లో డెయిరీ ఫామ్‌లను ఏర్పాటు చేశారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లోని ఎన్టీఆర్‌ నగర్‌ , సరస్వతి నగర్‌ , బాలజీ నగర్‌ , తదితర ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో గేదెలకు స్థావరాలు ఏర్పాటు చేసి ఉదయం , సాయంత్రం సమయంలో కాలనీలు, అపార్టుమెంట్ల వద్దకు గేదెలు తీసుకొచ్చి అక్కడే పాలు పితికి పట్టణ వాసులకు నాణ్యమైన విడిపాలను అందిస్తున్నారు. ప్యాకె ట్‌ పాల కంటే లీటరు మీద 10 రూపాయలు తక్కువగా విక్రయిస్తుండడంతో పట్టణ ప్రజలు అత్యధిక శాతం మంది విడి పాల పట్ల ఆసక్తి చూపుతున్నారు.

పాల వ్యాపారం పట్ల మొగ్గుచూపుతున్న మహిళలు

రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సబ్సిడీ ద్వారా గేదెలను కొనుగోలు చేసేందుకు నిధులను కూడా కేటాయిస్తుంది. దీంతో అత్యధిక మంది మహిళలు పాల వ్యాపారం పట్ల మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.92 లక్షల మంది మహిళలు రిజిస్ట్రేషన్‌ చేసుకుని పాల వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వారిలో సుమారు 40 వేల మందికిపైగా మహిళలు నిత్యం పాల వ్యాపారమే జీవనోపాధిగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఒక్కో గేదె రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాలను ఇస్తుంది. లక్ష నుంచి లక్షా యాబై వేల రూపాయలు విలువ కలిగిన ఆ గేదెలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని కూడా సబ్సిడీ రూపంలో అందిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని పలువురు మహిళలు కూడా పాల వ్యాపారం పట్ల ఆసక్తి చూపుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement