Thursday, May 16, 2024

Danger: కరోనా కొత్త వేరియంట్‌ ఏవై12.. తెలంగాణ‌, ఏపీలో వ్యాపిస్తోందట..

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తీవ్రత అదుపులోకి వస్తోందని భావిస్తున్న సమయంలో కొత్త వేరియంట్‌ కేసులు వెలుగు చూడటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. డెల్టా ప్లస్‌లో సబ్‌ వేరియంట్‌గా గుర్తించిన ‘ఏవై 12’ రకం వైరస్‌ మూలాలు రాష్ట్రంలో బయటపడుతున్నాయి.

ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా గుర్తించిన ఈ సబ్‌ వేరియంట్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి 18 మందికి సోకినట్లుగా నిర్థారణ కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 178 నమోదైతే ఆంధ్రప్రదేశ్‌లోనే 18 కేసులను గుర్తించారు. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ సబ్‌ వేరియంట్‌ను ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా ప్రకటించి రెండు తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

తెలంగాణలో కూడా ‘ఏవై 12’ సబ్‌ వేరియంట్‌కు సంబంధించి 15 కేసులు నమోదైనట్లుగా వెల్లడించింది. కరోనా ఆంక్షలు దేశ వ్యాప్తంగా సడలించిన నేపథ్యంలో వివి ధ దేశాలు అలాగే రాష్ట్రాల మధ్య రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కొత్త వేరియంట్‌లు మనదేశంలోకి విస్తృతంగా ప్రవేశిస్తున్నాయి. ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేని పక్షంలో కొత్త వేరియంట్లతో తీవ్రముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌పై దృష్టి..
రాష్ట్రంలో ఏవై 12, డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు బయటపడటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గుర్తించిన బాధితులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తోంది. అలాగే కొత్త వేరియంట్‌ వెలుగు చూసిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించడంపై దృష్టి సారించింది. కొత్త వేరియంట్ల పూర్తి స్వభావంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో ముందుగానే అప్రమత్తమై ఆసుపత్రుల్లో ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement