Friday, April 26, 2024

క‌రోనా బీమా సొమ్ము స్వాహా – ఎపిలో కోట్లాది రూపాయిల స్కామ్

అమరావతి, ఆంధ్రప్రభ,బ్యూరో: రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా భీమా సొమ్ము దారి మళ్లుతున్నది. కొంతమంది పెద్దలు తెరవెనుక ఉండి దోపిడీ దందాకు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సచివాలయాల కేంద్రంగా సాగు తున్న ఈ స్కాంలో క్షేత్ర స్థాయిలో కొంతమంది సచివాల యాల ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం, రాష్ట్ర స్థాయిలో మరి కొంతమంది ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కోవిడ్‌ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భీమా పాలసీపై ఎవరికీ అవగాహన లేకపోవడం దోపిడీ దారులకు మరింత కలిసొచ్చింది. పక్కా పథకంతో దశల వారీగా భీమా సొమ్మును దోచుకుంటూ కేంద్ర నిధులకు గండి కొడుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019 డిసెంబర్‌లో కోవిడ్‌ పుట్టింది. అయితే 2020 మార్చిలో రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను వణికించిన కరోనాతో దేశంలో కూడా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో కూడా లక్షల్లో బాధితు లు నమోదవుతూ వచ్చారు. దీంతో కోవిడ్‌ బాధితులకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వం కరోనా రక్షక్‌, కరోనా కవచ్‌ పేరుతో భీమా(ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ) పాలసీని తీసుకొచ్చింది. కరోనా సోకి 72 గంటలు పైన(3 రోజులకు) పైగా ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులకు సంబంధిత సర్టిఫికేట్ల ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షలు ఆర్ధిక సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పై పథకాల ద్వారా భీమా పాలసీని అమలు జరుపుతుంది. కేంద్రం నుంచి ఆర్ధికసాయం ఆశించే బాధితులు ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, కరోనా పాజిటివ్‌ సర్టిఫికేట్లను ఆన్‌లైన్‌లో పాలసీకి నమోదు చేయాలని ఆన్‌లైన్‌లో సంబంధిత సర్టిఫికేట్లన్ని పొందుపరిస్తే వారం రోజుల్లోపే బాధితుల అకౌంట్‌లో వారి వ్యాధి తీవ్రతను బట్టి రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షలను కేంద్రం జమ చేస్తుంది. అయితే ఈ విషయం 95 శాతం మంది బాధితులకు తెలియదు. గత ఏడాది భీమా సమాచారం బయటకు రావడంతో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా ఆ సొమ్మును కాజేసేందుకు రంగంలోకి దిగారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట బిట్‌-2 సచివాలయం పరిధిలో వెలుగు చూసిన సంఘటనపై తీగ లాగితే డొంక కదులుతుంది.

బాధితుల నిధులను..బొక్కేస్తున్నారు
బీమా పథకంపై బాధితులకు అవగాహన లేకపోవడాన్ని తమకు అనుకూలంగా మలచుకున్న సచివాలయం సిబ్బంది కొంతమంది పెద్దల ఆశీస్సులతో గుట్టుచప్పుడు కాకుండా ఆయా ప్రాంతాల పరిధిలోని కోవిడ్‌ బాధితులను కలిసి వారి నుంచి అవసరమైన సర్టిఫికేట్లను తీసుకుని లక్షలాది రూపాయలు బొక్కేస్తున్నారు. వారికి రూ.5 నుంచి రూ.10 వేలు ఇస్తూ మిగిలిన సొమ్మును సచివాలయ సిబ్బంది రాజమార్గంలోనే దోచేస్తున్నారు. ఒక సచివాలయం పరిధిలోనే 30 మంది బాధితులకు సంబంధించి రూ.30 లక్షలకు పైగా స్కాం వెలుగు చూసిందంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆయా సచివాలయాల పరిధిలో దందా పెద్దఎత్తున సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయా సచివాలయాల పరిధిలో 2020-21 సంవత్సరాల పరిధిలో కోవిడ్‌ బారిన పడిన బాధితులను గుర్తించి వారి వద్ద నుంచి సంబంధిత రికార్డులను సేకరించి పథకం ప్రకారం పాలసీ నిధులను దారి మళ్లిస్తున్నారు. ఈ వ్యవహారంపై బాధితులకు ఎక్కడా అనుమానం రాకుండా వారిని ముందే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రపథకం ద్వారా సచివాలయం పరిధిలో ఉమ్మడిగా భీమా సొమ్మును మంజూరు చేయించే ప్రయత్నం చేస్తున్నామని, అందుకు సంబంధించిన మొత్తం మీ ఖాతాకే జమ అవుతుందని, వాటిలో నుంచి మీకు సంబంధించిన రూ.10 వేలు మాత్రమే తీసుకుని మిగిలిన రూ.లక్ష 90 వేలు తమ ఖాతాకు డిపాజిట్‌ చేయాలని నమ్మిస్తున్నారు. దీంతో సచివాలయాల సిబ్బంది చెప్పిందే నిజమని నమ్ముతున్న బాధితులు భీమా సొమ్ములో కేవలం 10 శాతం మాత్రమే తీసుకుని మిగిలిన 90 శాతం నిధులను సిబ్బందికే ఇచ్చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సిబ్బంది చేతిలో మోసపోతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎక్కడా ఫిర్యాదులు నమోదు కాకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా సాగుతూ వస్తుంది.

స్కాం వెనుక..పెద్దల హస్తం
కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కోవిడ్‌ భీమాకు సంబంధించిన నిధుల స్కాం వెనుక రాష్ట్ర స్థాయిలో పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు క్షేత్ర స్థాయిలో సిబ్బందితో చేతులు కలిపి ఆయా జిల్లాల్లో ఆసుపత్రుల యాజమాన్యంతో కుమ్మక్కై తమకు అనుకూలంగా ఆన్‌లైన్‌ నివేదికలను రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాలోనూ లక్షల మంది కోవిడ్‌ బాధితులు ఉన్నారు. వేల సంఖ్యలో కరోనాతో మరణించారు. అటువంటి వారి కుటుంబాలన్ని నేడు ఆర్ధికంగా చితికిపోయి సాయం చేసే వారి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. అటువంటి వారికి కేంద్ర ప్రభుత్వ పథకం కొంత ఆసరాను అందించే అవకాశం ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కోవిడ్‌ బాధితుల పేరుతో పెద్ద ఎత్తున నిధులను బొక్కేస్తున్నారు. అందుకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆయా జిల్లాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ సొమ్మును గద్దల్లా తన్నుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement