Tuesday, May 14, 2024

ఏపీ వైద్య విద్యారంగంలో నవశకం.. ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించనున్న సి.ఎం జగన్

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ వైద్య విద్య రంగ చరిత్రలో ఆవిష్కృతం కానున్న నవశకంలో ఎంఈఐఎల్‌ భాగస్వామ్యమైంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ఐదు వైద్య కళాశాలను ప్రారంభించనున్నారు. వీటిలో విజయనగరం వైద్య కళాశాలను ప్రత్యక్షంగా ప్రారంభిస్తుండగా, నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలను వర్చ్యువల్‌ గా ప్రారంభిస్తారు. వీటిలో మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలను ఎంఈఐఎల్‌ నిర్మించింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో భాగంగా 17 నూతన వైద్య కళాశాలల స్దాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటిలో ఐదు కళాశాలలు భారత వైద్య విద్యా మండలి (ఎంసిఐ) అనుమతి పొంది నీట్‌ పరీక్ష ద్వారా అర్హత సాధించిన వారిని వైద్య కోర్సులో చేర్చుకుని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాయి. ఒక్కో కళాశాలలో 150 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు చేరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైద్య విద్యా రంగం, ఆరోగ్య సంరక్షణ లో ఒక ముఖ్యమైన మైలు రాయిని దాటటంలో ఎంఈఐఎల్‌ భాగస్వామ్యం కావటం విశేషం.

మూడు పూర్తి.. తొమ్మిది వివిధ దశల్లో

- Advertisement -

గత శతాబ్ది కాలంలో రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం 17 వైద్య కళాశాలలు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం వైద్య కళాశాలల నిర్మాణాన్ని ఎంఈఐఎల్‌ త్వరితగతిన పూర్తి చేసింది. పిడుగురాళ్ల, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, అనంతపురం, పెనుగొండ, తిరుపతి, అమలాపురం, పాలకొల్లులో వైద్య కళాశాలలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.

ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసిన మూడు కళాశాలల్లో విశాలమైన తరగతి గదులు, అత్యాధునిక ప్రయోగశాలలు, లైబ్రరీలు, ఆడిటోరియంలు, వైద్య విద్యార్థిని విద్యార్థులు , అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి వసతి సౌకర్యాలని ఎం ఈ ఐ ఎల్‌ నిర్మించింది.

అత్యాధునిక టెక్నాలజీతో

రాజమండ్రి మెడికల్‌ కాలేజీని 3.37 ఎకరాలలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంఈఐఎల్‌ నిర్మించింది. ఇందులో వైద్య కళాశాల, విద్యార్థులు, సిబ్బందికి వసతి, నర్సింగ్‌ కళాశాల, ప్రధాన బ్లాకులతో పాటు, ప్రయోగశాలలు, లైబ్రరీ గది, లెక్చర్‌ హాల్స్‌, బయోమెడికల్‌ వేస్ట్‌ డిస్పోజబుల్‌ రూమ్‌, వంటగది, క్యాంటీన్‌ ఉన్నాయి. మచిలీపట్నం మెడికల్‌ కాలేజీ 64.38 ఎకరాల్లో విస్తరించి ఉంది.

ఇందులో 13 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలను ఎంఈఐఎల్‌ చేపట్టింది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ కళాశాల నిర్మాణ ప్రాంత నేల స్వభావాన్ని దృష్ట్యా నిర్మాణాలు పటిష్టంగా ఉండేలా బలమైన పునాదుల కోసం జియోటెక్స్‌టైల్‌, జియోగ్రిడ్‌, గ్రాన్యులర్‌ సబ్‌-బేస్‌ వంటి వినూత్న పద్ధతులను ఎంఈఐఎల్‌ ఉపయోగించింది. నిర్మాణాన్ని మరింత సులభతరం చేయడానికి, ఉప్పు లేని నీటిని నిల్వ చేయడానికి జియో మెమోరియల్‌ షీట్ల సహాయంతో 1.15 కోట్ల లీటర్ల సామర్థం గల ప్రత్యేక నీటి నిల్వ ట్యాంక్‌ను ఎంఈఐఎల్‌ నిర్మించింది.

ఇక్కడ రోజువారీ నిర్మాణ పనులకు దాదాపు 50 వేల లీటర్ల నీరు అవసరం.ఇన్‌-పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌, అవుట్‌-పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌, డయాగ్నస్టిక్‌ బ్లాక్‌, మెడికల్‌ కాలేజ్‌ మొదలైన నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అవ్వగా మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. హేలాపురి ప్రజల ఐదు దశాబ్దాల కోరికను నెరవేర్చటంలో ఏలూరు వైద్య కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయటం ద్వారా ఎంఈఐఎల్‌ భాగస్వామి అయింది.

ఈ కళాశాలలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక వైద్య కళాశాల, 24/7 అక్యూట్‌ కేర్‌ బ్లాక్‌, మాతాశిశు సంరక్షణ భవనం, హాస్టల్స్‌, స్టాఫ్‌ క్వార్టర్స్‌, రోగులు, సహాయకుల వసతి గృహం,క్యాంటీన్ల విస్తరణ వంటివి ఎంఈఐఎల్‌ చేపట్టి ఐదు కీలక బ్లాకుల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement