Thursday, May 2, 2024

మన పాశ్చాత్య, సంస్కృతీ, సంప్రదాయాలు భావితరాలకు అందించాలి – భారత ఉప రాష్ట్రపతి

ఏర్పేడు/తిరుపతి, 2015 మార్చి 28న త‌న చేతులతో శంఖుస్థాపన చేసిన క‌ళాశాల సాకారమై నేడు అందరి సహకారంతో ఆకారం ఏర్పడి, ఈప్రాకారంలో పాల్గొనడం అదృష్టమని భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. తిరుప‌తి ఐఐటి క‌ళాశాల 6వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయ‌న ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను ప్ర‌ధానం చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగిస్తూ, వైద్య విద్య, శాస్త్ర సాంకేతిక విద్య, పరిశోధనలు, న్యాయ విద్య భారతీయ భాషల్లో భోధించే రోజులు రావాలని, వస్తాయని త‌న‌కు ప్రగాడ విశ్వాసం ఉందని తెలిపారు. ఉన్నత పాఠశాల విద్య వరకు మాతృ బాషలో బోధన ఉండాలని, పరిపాలన విషయంలో ప్రజల భాషలో ఉండాలని, న్యాయ స్థానాల వాదనలు, తీర్పులు మాతృ బాషలో ఉండాలని అన్నారు. మాతృ బాష తరువాతనే పరుల బాషలు నేర్చుకోవాలని భారతీయ సాంప్రదాయాలు భావితరాలకు నేటియువత అందించాలని అన్నారు. ప్రపంచ దేశాల కన్నా కోవిడ్ – 19 నియంత్రణ మన దేశం లో మెరుగుగా ఉందని అందుకు మన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటివని అన్నారు. రైతుల విషయంలో 98 శాతం మందికి కోవిడ్ – 19 దరిదాపులకు కూడా రాలేదని గుర్తు చేస్తూ, వారు కష్టపడే విధానం, పీల్చే గాలి, తిండి కారణమని అన్నారు. తిరుపతి పవిత్ర పుణ్య క్షేత్రమని, జ్ఞాన యజ్ఞం లా ఇక్కడ విద్య ఉంటుందని, విద్యా హబ్ గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఆదికాలం, వేదకాలం నుండి ధర్మాన్ని అనుసరించే దేశమని, నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు పరాయి పాలనలో కనుమరుగైయ్యానని, అయినా నేడు ప్రపంచం పెట్టుబడులకు భారత దేశం వైపు చూస్తున్నదని అన్నారు. సంపద ఉంటే సంతోషం రాదని, ఆత్మ సంతృప్తి, ఆనందం వంటివి ఆధ్యాత్మికత, యోగాలతో సాకారం అవుతుందని అన్నారు. ఇంజినీరింగ్ విద్యతో పాటు ఇక్కడ ఫుడ్ టెక్నాలజి, కొత్త ఆవిష్కరణలు వంటివి రావాలని అన్నారు. సామాజిక అవసరాల మేరకు దేశానికి విజ్ఞానాన్ని యువత అందించేలా అలవరచుకోవాలని, బోధనలు తదనుగుణంగా జరగాలని అన్నారు. కలలు కనేటప్పుడు పెద్దవి గా వుండాలనే అబ్దుల్ కలాం ఆశయాన్ని, స్వామి వివేకానంద బోధనలు యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని, ఆత్మ నిర్భర్ భారత్ అందిపుచ్చుకోవాలని అన్నారు. సామాన్య మానవుడు, పేదవాడు సంతోష పడే విధంగా, అవసరాలు తీర్చగలిగేలా మన విజ్ఞానం సహాయపడాలని సూచించారు.
మాతృ మూర్తిని, మాతృ భాషను, గురువును మరువరాదని అన్నారు.
ఈ కార్యక్రమం లో డిప్యూటీ సి ఎం కె. నారాయణస్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఐఐటి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement