Saturday, May 4, 2024

24న తిరుపతి 893వ పుట్టినరోజు…ఆరంభమైన సన్నాహం

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : సుప్రసిద్ధ తిరుపతి పుణ్యక్షేత్రం 893వ పుట్టినరోజు పండుగకు ముస్తాబవుతోంది. 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన పూజ్య రామానుజాచార్యులు గోవిందరాజ ఆలయం ప్రతిష్ట, మాడ వీధుల ఏర్పాటు ద్వారా తిరుపతి పట్టణ ఆవిర్భావానికి నాంది పలికినట్టు శాసనాధారాలు పేర్కొంటున్నాయి. ఆ అంశం ప్రాతిపదికగా తిరుపతి పుట్టినరోజును జరిపే ఆనవాయితీకి తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏడాది క్రితం శ్రీకారం చుట్టారు. ఆ ఆనవాయితీ కొనసాగింపుగా ఈనెల 24వ తేదీన తిరుపతి 893వ పుట్టినరోజు పండుగలా నిర్వహించనున్నట్టు మంగళవారం వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆపై స్థానిక గోవిందరాజ ఆలయం వద్దకు చేరుకొని పుట్టినరోజు ప్రాముఖ్యతను తెలియచేస్తూ అందరినీ ఆహ్వానించే కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్బంగా రామానుజ పరంపరలో భాగమైన జీయర్ మఠం వద్దకు వెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానాల (టీ టీ డీ) పెద్ద జీయర్, చిన్న జీయర్ లకు ఆహ్వాన పత్రాలను అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… ప్రపంచం ప్రసిద్ధి గాంచిన తిరుపతి పట్టణం చరిత్రను చాటిచెప్పే విధంగా, చారిత్రక ఆధారాలతో పుట్టినరోజు పండుగ మొదలు పెట్టామని చెబుతూ ఈనెల 24న తిరుపతి వాసులందరినీ భాగస్వాములుగా చేసే పండుగను టీ టీ డీ, తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సన్నాహక‌ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement