Sunday, May 5, 2024

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రకారంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనం, పసుపు తదితర సుంగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దయ్యాయి. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, విజివో బాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement