Thursday, May 2, 2024

ఇకపై తిరుచానూరులో రాత్రి కూడా అన్నప్రసాద వితరణ : టి.టి.డి చైర్మన్

తిరుచానూరు, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : తిరుచానూరులోని టి.టి.డి కి చెందిన అన్నప్రసాద భవనంలో రాత్రి వేళ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని టి.టి.డి ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ఈరోజు రాత్రి ప్రారంభించారు. ప్రస్తుతం ఉదయం మాత్రమే కొనసాగిస్తున్న అన్న ప్రసాద వితరణను ఈరోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు రోజుకు రెండు పూటలా కలిపి దాదాపు ఒక లక్షా 30 వేల మందికి రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఎక్కువమంది భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వస్తున్నారని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 2007, నవంబరు 22న ఇక్కడ అన్నప్రసాద వితరణ ప్రారంభమైందన్నారు. తోళప్పగార్డెన్స్‌లో గల ఈ అన్నప్రసాద భవనంలో ప్రస్తుతం రోజుకు సుమారుగా 5 వేల నుండి 6వేల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీరిస్తున్నారని తెలిపారు.

అంతే కాక టీటీడీ స్థానికాలయాల్లో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు యోచిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. స్థానికాలయాల్లో బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, రథసప్తమి, పుష్పయాగం, వసంతోత్సవాలు లాంటి పర్వదినాల సమయంలో భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తున్నామని చెప్పారు. అంతకుముందు అన్నప్రసాద భవనంలో స్వామి, అమ్మవార్ల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఛైర్మన్ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, మురంశెట్టి రాములు, జేఈవో వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవోలు గోవిందరాజన్, సుబ్రహ్మణ్యం,క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి, తిరుపతి క్యాటరింగ్ అధికారి సాయిబాబారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement