Saturday, May 4, 2024

గోల్డ్‌ స్మగ్లర్లకు చెక్‌.. సరిహద్దుల్లో నిఘానేత్రం

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌పై కస్టమ్స్‌ నిఘా పెంచారు. చెన్నై కేంద్రంగా ఏపీకి విదేశీ బంగారం పెద్దఎత్తున స్మగ్లింగ్‌ జరుగుతున్న నేపధ్యంలో నిఘాను పటిష్టం చేయడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో విజయవాడ కస్టమ్స్‌ కమిషనరేట్‌ (ప్రివెంటివ్‌) అధికారులు ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై దృష్టి సారించారు. వేగుల (ఇన్‌ఫార్మర్లు)ను అప్రమత్తం చేశారు. కొంతకాలంగా చెన్నై నుంచి ఏపీలోకి కిలోల కొద్దీ స్మగ్లింగ్‌ బంగారం వస్తోంది. బంగారం రేటు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రధాన పట్టణాల్లోని పేరొందిన వ్యాపారులు స్మగ్లర్ల ద్వారా బంగారం దిగుమతి చేసుకుంటున్నారు.

హవాలా మార్గంలో ముందుగానే చెన్నై స్మగ్లర్లకు నగదు చెల్లింపులు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వివిధ పన్నులు చెల్లించి కొనుగోలు చేసే బంగారం అమ్మకాలపై కిలోకి రూ.20 వేలకు మించి వ్యాపారులకు లాభాలు ఉండే పరిస్థితి లేదు. ఇదే స్మగ్లింగ్‌ బంగారంలో ఒక్కొక్క కిలోకు రూ.2 లక్షల వరకు మిగులుతుందని అధికారులు చెపుతున్నారు. పైగా ప్రభుత్వానికి ఏ విధమైన పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపన్ను కట్టే సమస్యే ఉండదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని స్మగ్లింగ్‌ బంగారంపైనే వ్యాపారులు ఆసక్తి చూపుతున్నట్లు కస్టమ్స్‌ అధికారుల దృష్టికి వచ్చింది. రానున్న రోజుల్లో స్మగ్లింగ్‌ బంగారం మరింత పెద్ద ఎత్తున ఏపీకి దిగుమతి అయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

- Advertisement -

రెండు నెలల్లో 26 కిలోలు స్వాధీనం..

ఏపీలో రెండు నెలల లోపే 15.48 కోట్ల విలువైన 26 కిలోల బంగారం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఏపీకీ తీసుకొస్తున్న తరణంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విదేశీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10 తెల్లవారు జామున గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా సమీపంలో నిఘా ఉంచిన కస్టమ్స్‌ అధికారులు, రూ.8 కోట్ల విలువైన 13 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు వాహనాల్లో బంగారం తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారంపై నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

మార్చి 22న విజయవాడ రైల్వే స్టేషన్‌లో చెన్నై నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులను అనుమానంపై అదుపులోకి తీసుకొని ఐదు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంపై నెల్లూరు జిల్లా శివారు తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో తనిఖీ నిర్వహించి 2.97 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఆ బంగారం విలువ రూ.7.48 కోట్లుగా అధికారులు నిర్థారించారు. గత ఏడాది రూ.17.32 కోట్ల విలువైన 33.5 కిలోల బంగారం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రిస్క్‌ స్మగ్లర్లదే..

దాడుల్లో పట్టుబడిన బంగారంతో వ్యాపారులకు సంబంధం లేకపోవడంతో పెద్దఎత్తున దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆర్డర్‌పై సొంత రిస్క్‌తోనే స్మగ్లర్లు వ్యాపారులకు బంగారం అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ పట్టుబడిన స్మగ్లర్‌ గ్యాంగ్‌ సభ్యులు ఏ ఒక్కరి పేరు చెప్పే అవకాశం లేదు. చెన్నై కేంద్రంగా ఉన్న వ్యాపారులు హవాల ఏజెన్సీల ద్వారా క్యారియింగ్‌ఒ సంస్థలకు అప్పచెపుతారు. వారు ఇక్కడికి తీసుకొచ్చి నేరుగా వ్యాపారులకు కాకుండా ఆయా వ్యక్తులకు సంబంధించిన వారికి అందజేస్తారు. ఏ పట్టణంలో డెలివరీ ఇవ్వాలో అక్కడికి వెళ్లే వరకు కూడా ఎవరిని కలుస్తున్నామో తెలియదు. ఆ పట్టణానికి వెళ్లిన తర్వాత చెన్నై నుంచి వచ్చే సమాచారం ఆధారంగా బంగారం అందజేయడం, అక్కడి నుంచి వ్యాపారులకు చేరుతుంది. అందుకే స్మగ్లింగ్‌ బంగారంలో ప్రధాన వ్యక్తులు పట్టుబడరని తెలుస్తోంది.

ప్రత్యేక బృందాలు..

పట్టుబడిన కేసుల్లో ప్రధాన వ్యక్తుల పాత్ర తెరపైకి రాకపోవడంపై కస్టమ్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రధానమైన వ్యక్తులతో లింకులు లేకుండానే రూ.కోట్లలో బంగారం స్మగ్లింగ్‌ చేరవేతపై దృష్టి సారించారు. ఇప్పటికే 100 మంది వరకు అధికారులు, సిబ్బందితో కూడిన పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో కొన్ని బృందాలు సమాచారం సేకరిస్తే, మరికొన్ని బృందాలు దాడులు నిర్వహిస్తుంటుంది. మరికొన్ని బృందాలు కీలక సూత్రధారుల ఆచూకీ కోసం అవసరమైన సమాచార సేకరణ వేగుల (ఇన్‌ఫార్మర్ల) ద్వారా ఆచూకీ తీసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ఏపీలోని ప్రదాన పట్టణాల్లో పెద్దఎత్తున వ్యాపారం నిర్వహించే బంగారు షాపులపై కూడా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వివిధ రకాల్లో ఏపీకి స్మగ్లింగ్‌ బంగారం రాకుండా కట్టడి చేసే పనిలో కస్టమ్స్‌ అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement