Friday, April 26, 2024

ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో మార్పులు.. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. తాజాగా మంగళవారం కొత్త ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ ప్రకటించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 7 వరకు నిర్వహిస్తామని తెలిపింది. అలాగే ఎథిక్స్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను ఫిబ్రవరి 15న, ఎన్విరాన్‌మెంట్‌ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు బోర్డ్‌ ప్రకటించింది. మిగిలిన థియరీ పరీక్షలు యథావిధిగానే గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని బోర్డ్‌ స్పష్టం చేసింది. గతంలో ఏప్రిల్‌ 15 నుంచి మే 10వ తేదీ వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ను విడుదల చేసింది.

అయితే ఈ పరీక్షలతో ఎంసెట్‌, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం లేదని సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో తాజాగా కొత్త షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. గతంలో మాదిరిగానే థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వెల్లడించింది. ఇక ప్రాక్టికల్‌ పరీక్షలు 10 రోజుల పాటు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు షెడ్యూల్‌లో పరీక్షలు ఉంటాయని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement