Thursday, May 16, 2024

Delhi | బకాయిల విడుదలకు కేంద్రం హామీ.. ఢిల్లీ పర్యటనలో మంత్రి కారుమూరి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న బియ్యం సబ్సిడీ నిధుల విడుదలకు కేంద్రం హామీ ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పౌరసరఫరాల శాఖ మంత్రుల జాతీయ సదస్సులో పాల్గొన్నారు. రేషన్ కార్డు లబ్దిదారులకు నాణ్యమైన నిత్యావసరాల పంపిణీలో ఎదురవుతున్న సవాళ్లపై సమావేశంలో చర్చించామని మంత్రి తెలిపారు.

సమావేశం అనంతరం నాగేశ్వరరావు కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. 2012–2018 కాలానికి సంబంధించి కేంద్రం నుంచి రావలసిన బియ్యం సబ్సిడీ చెల్లింపుల గురించి గుర్తు చేశారు. నిధుల విడుదలకు పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బియ్యానికి ప్రత్యామ్నాయంగా రాయలసీమ జిల్లాల్లో రాగులు, ఉత్తరాంధ్రలో జొన్నలు సరఫరా చేస్తున్నామని, అయితే గిరాకీకి సరిపడా ధాన్యం లేని కారణంగా ఎఫ్‌సీఐ నుంచి ఇప్పించాల్సిందిగా కోరామన్నారు.

కందుల సరఫరాకు సంబంధించి ఎఫ్‌సీఐ నుంచి రావలసిన 50 వేల మెట్రిక్ టన్నులలో కొంత మొత్తమే వచ్చిందని, మిగతా ధాన్యం గురించి కేంద్రమంత్రితో చర్చించామని నాగేశ్వరరావు వివరించారు. గోడౌన్లు లేని చోట బియ్యం నిల్వ కోసం పైలట్ ప్రాజెక్టు కింద బీహార్‌లో ‘రైస్ సైలోస్’ల నిర్మాణాన్ని చేపట్టాలనుకుంటున్నామని, భారతదేశ బియ్యపు భాండారంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద ‘రైస్ సైలోస్’ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరముందని పీయూష్ గోయల్‌కు సూచించామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement