Thursday, May 9, 2024

KNL: ఆళ్లగడ్డలో బెల్ట్ షాపుల జోరు

ఆళ్లగడ్డ, ఆంధ్రప్రభ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాలు తొలగించి ప్రభుత్వ మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. మద్యపాన నిషేధం పేరుతో మద్యం రేట్లు భారీగా పెంచినప్పటికీ ఎట్టకేలకు మళ్లీ మద్యం ధరలు తగ్గించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకాలో ప్రభుత్వ మద్యం షాపులను నిర్వహిస్తున్న సిబ్బందిపై అవినీతి ఆరోపణ వెలుగుతున్నాయి. అక్రమార్జన కోసం ప్రభుత్వ మద్యాన్ని యదేచ్ఛగా నిత్యం బెల్టు షాపులకు పంపిణీ చేస్తున్నారని మద్యం ప్రియులు పలువురు ఆరోపిస్తున్నారు. క్వాటర్ మద్యానికి 20 రూపాయల నుండి 30 రూపాయలు దాకా అదనంగా తీసుకొని కావాల్సినంత ప్రభుత్వ మద్యాన్ని బెల్టు షాపులకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ విధంగా నిత్యం వందల కొద్ది బాటిళ్లు బెల్ట్ షాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు బహిరంగంగానే వినవస్తున్నాయి.

ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం ప్రియుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దీనిని అవకాశంగా తీసుకున్న సిబ్బంది అక్రమార్జన కోసం బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తూ నిత్యం వేలాది రూపాయలను దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆళ్లగడ్డ పట్టణంలో బెల్టు షాపులను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మొక్కుబడిగానే అమ్మకాలు జరుగుతుండగా బెల్టు షాపుల్లో మాత్రం రేయి పగలు అమ్మకాలు జోరుగా నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. బెల్టు షాపుల్లో క్వాటర్ కు 50 రూపాయలు అదనంగా చెల్లించి మద్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇలా సిబ్బంది బెల్టు షాపులను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక సమయాల్లో మద్యం లేదని, స్టాకు రాలేదని సాకులు చెబుతూ మందుబాబులను వెనక్కి పంపడం పరిపాటిగా ఇక్కడ జరుగుతుంది. సిబ్బంది చేతివాటం దెబ్బకు గల్లీ గల్లీలో బెల్ట్ షాపులు వెలిశాయి. ఇదంతా అధికారులకు తెలియనిది ఏమీ కాదు. అంతేకాకుండా పండగలకు పబ్బాలకు బెల్ట్ షాపుల నుండి అధికారులు మద్యం తీసుకు వెళుతున్నారని విమర్శలు రావడం కడు శోచనీయం.

అప్పుడప్పుడు నామమాత్రపు మొక్కుబడిగా అధికారులు దాడులు చేసి కేసులు పెడుతుండడంతో బెల్టు షాపు నిర్వాహకుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలో ఉన్న బెల్టు షాపుల్లో మద్యం బ్లాక్ లో అమ్ముతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ మద్యం దుకాణం పట్టణాల్లో అయితే ఉదయం 11 గంటలకు తీసి రాత్రి పది గంటల వరకు అని నిబంధనలు చెబుతున్నాయి. అయితే రాత్రి మద్యం కొరతను ఆసరా చేసుకున్న బెల్ట్ షాపుల యజమానులు షాపులోని ఉద్యోగులు అండ దండలతో యదేచ్ఛగా బాహాటంగానే రాజసంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. బెల్టు షాపుల్లో అమ్మకాలలో లాభాలను చూసిన పలువురు చిన్న అంగళ్ళ యజమానులు సైతం ఆదాయ వనరు బాగా ఉందని ప్రతి గ్రామంలో మద్యం అమ్మకాలు కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామాన గొంది గొందిలో సందు సందులో బెల్ట్ షాపులు నడుపుతూ ప్రత్యేక ఆదాయం గడిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు.ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఎక్సైజ్, సెబ్ పోలీస్ అధికారులు నిద్రపోతున్నారా ? నిద్ర నటిస్తున్నారా ? అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్టు షాపులు నడుపుతూ ప్రభుత్వ మద్యం దుకాణాలకు ధీటుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

- Advertisement -


ప్రభుత్వ మద్యం దుకాణాల నుండి వచ్చిన స్టాక్ వచ్చిన రోజు నుండి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ప్రధాన బ్రాండ్లు మద్యం కేసులు రాత్రికి రాత్రే స్కాన్ చేసి బిల్లులు కొడుతూ బెల్టు షాపు వారికి సప్లై అందజేస్తున్నారని ఒక్కొక్క 180ఎంఎల్ బాటిల్ మీద 20 నుండి 30 రూపాయల వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రధాన కంపెనీలో అయినా కింగ్ ఫిషర్ నాకౌట్ బీర్లు, మ్యాన్షన్ హౌస్ క్వాటర్ ఫుల్ బాటిల్స్ కూడా బెల్ట్ షాపులకు తరలిస్తున్నారని మందు బాబులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ మద్యం షాపుల్లో తిను బండరాల షాపులు…

ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎటువంటి తినుబండారాల షాపులు ఉండకూడదని, అలాగే షాపుల్లో మద్యం సేవించకూడదని నిబంధనలు ఉన్నప్పటికినీ ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షణ చేసి సబ్ అధికారుల అనుమతితో ప్రతి ప్రభుత్వ మద్యం షాపులో తినుబండారాల షాపులను ఏర్పాటు చేస్తూ ఉన్నా వారికి అనుమతుల రూపంలో అక్రమార్జనకు పాల్పడుతున్నారని, షాపుల అనుమతి రాని వారి ఆవేదనలో తెలుస్తుంది. తిను బండారాల రూపంలో ఆదాయం గడించడమే కాకుండా ప్రభుత్వ మద్యం షాపు మూసి వేయగానే బెల్టు రూపంలో అక్కడ మద్యం దుకాణాలు కొనసాగిస్తూ అందిన కాడికి మందుబాబుల జేబులను కొల్లగొట్టేస్తున్నారు. ఇదంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లో జరుగుతుందన్న సంగతి జగమెరిగిన సత్యం. ప్రభుత్వ మద్యం షాపుల్లో తినుబండారాల అంగళ్ళు ఉండడంతో అక్కడే మద్యం సేవిస్తూ ఉన్నారు. ఇందుకు ఉదాహరణ ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని రుద్రవరంలో ఉన్నా కూడా వాటిపైన ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోకపోవడం ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో జరిగే పరిమాణాలను జిల్లా అధికారులకు క్షుణ్ణంగా తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకునేలా ఉండాలని పలువురు కోరుతున్నారు. మరి ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు పాటిస్తారో దానిపై పర్యవేక్షణ ఎలా చేస్తారో వేచి చూడాల్సిందే. ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని బెల్ట్ షాపులను నివారించి చట్ట ప్రకారం నిబంధనల మేరకు అధికారులు పనిచేసేలా చూడాలని ప్రభుత్వ మద్యం పాలసీని సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement