Tuesday, May 14, 2024

ఉప ఎన్నిక కోసం రాయలసీమ జలాలపై డ్రామా!

రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేస్తోంది. తమ జలాలను ఏపీ ప్రభుత్వం దోచుకుంటోందని, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తుంటే.. నిబంధనల మేరకు తాము జలాలను వాడుకుంటున్నామని ఏపీ మంత్రులు చెబుతున్నారు. తెలంగాణ నేతలు విమర్శలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఈ నాటకంలో భాగస్వాములయ్యాయని విష్ణు ఆరోపించారు.  రెండు పార్టీలు తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల కోసం రాయలసీమ జలాలపై ఆడుతున్న డ్రామా అని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో అనుమతులు లేకుండానే ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారని… వాటికి తెలంగాణ ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందని విష్ణు ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతలు , దిండి ప్రాజెక్టు ఎవరు అనుమతులు తీసుకుని నిర్మాణం చేస్తున్నారో వివరించగలరా మంత్రిగారు ? అంటూ నిలదీశారు. రాజకీయాల కోసం లేని వివాదాలను సృష్టిస్తారని, కేంద్రం పరిష్కరించాలంటారని విమర్శించారు. రెండు ప్రభుత్వాలు బీజేపీపై అనవసర విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ నెల 28న ఏపీ బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశం కానుందని, ఈ సమావేశంలో అన్ని విషయాలను చర్చిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఓ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి, కేంద్ర మంత్రులను కలిసి, అన్ని అంశాలను వివరిస్తుందని విష్ణు తెలిపారు.

ఇదీ చదవండి: జల చౌర్యం ఆపండి.. లేదంటే యుద్ధమే: ఏపీకి తెలంగాణ మంత్రి వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement