Friday, May 3, 2024

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు బిగ్ రిలీఫ్

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుకు బిగ్ రిలీఫ్ లభించింది. చెన్నై మైలాపూర్‌లోని భూమికి సంబంధించి.. ఫైల్స్ తీసుకుని విశాఖ సబ్‌జోనల్‌ కార్యాలయానికి స్వయంగా హాజరుకావాలని మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్‌ను గతంలో ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అశోక్ గజపతిరాజు, ఆయన సోదరి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు.. వారికి జారీ చేసిన నోటీసులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఎలా జోక్యం చేసుకుంటుందని.. ఏ వివరాల ఆధారంగా ఈసీఐఆర్‌ కేసు నమోదు చేశారని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 21వ తేదీకి వాయిదా వేస్తూ.. న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అశోక్ గజపతిరాజు, ఆయన సోదరి తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కారణాలతో తమ పిటిషనర్లను రాజకీయ కారణాలతో వేధిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఈడీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌.. ఈడీ నోటీసులు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement