Saturday, May 4, 2024

Big Fight – దెందులూరు బరిలో ఇద్దరూ ఇద్దరే

(ప్రభన్యూస్, ఏలూరు బ్యూరో) .. ఉభయగోదావరి జిల్లాలో రాజకీయ పెత్తందారితనానికి వేదికగా వెలిగిన దెందులూరు నియోజకవర్గం ప్రజల్లో మార్పు వచ్చిందా? బడా నేతల రాజకీయ చరిత్ర ముగిసిందా? వారసత్వ నీడలు క్రీనీడలుగా మారాయా? ప్రజల్లో ఎంత మార్పు వచ్చినా.. రాజకీయ ఆధిపత్యపోరాటంలో.. జనం రెండు వర్గాలుగా విడిపోతారే గానీ.. మూడో శక్తికి అసలు అవకాశం ఇవ్వరని దెందులూరు రాజకీయ చరిత్ర నిరూపిస్తుంది. రాజకీయ విప్లవాధినేత ఎన్టీఆర్ రంగప్రవేశంతో 1983 నుంచి 2009 వరకూ… అంటే 26 ఏళ్లు దెందులూరు నియోజకవర్గంలో మాగంటి, గారపాటి వర్గాల మధ్య ఆధిపత్యపోరాటం కొనసాగింది. ఆ తరువాత సీన్ మారిపోయింది.

వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ
తాజాగా వైసీపీ, టీడీపీ మధ్య నువ్వానేనా అనే రీతిలో రాజకీయ పోరాటానికి బీజం పడింది. ఈ సారి ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవటానికి వైసీపీ, టీడీపీ అభ్యర్థులు మోహరిస్తున్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ తెరమీదకు వస్తోంది. బీసీ కార్డు మార్మోగుతోంది. వైసీపీ సామాజిక న్యాయంలో బీసీలను ఆకట్టుకునేందుకు యత్నిస్తుంటే.. జయహో బీసీ నినాదంతో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటి వరకూ రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరాటానికి తెరదించటానికి బీసీ కార్డుతో దెందులూరులో టీడీపీ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? లేక పాత ఒరవడినే కొనసాగిస్తుందా? అనే అంశాలు ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గం లో వైసీపీ, టీడీపీ పార్టీల్లో మరో అభ్యర్థి ప్రస్తావన లేకుండా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సీట్లు దాదాపు ఖరాయినట్లే, టీడీపీతో పొత్తు నేపథ్యంలో జనసేన తన పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచనే కనిపించడం లేదు. ఈ స్థితిలో హేమాహేమీలిద్దరూ దెందులూరు నియోజవర్గంలో హోరాహోరీగా ప్రచారం లో దూసుకుపోతున్నారు.

డేరింగ్.. డ్యాషింగ్ చింతమనేని

రాష్ట్రంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ గా ఎదిగిన చింతమనేని ప్రభాకర్ బయటకు కటువుగా విలన్ గా కనిపించినా.. నియోజవర్గంలోని పార్టీ కార్యకర్తలకు, తనను నమ్ముకున్న ప్రజలకు, ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా కంటికి రెప్పలా కాపాడుతారని, చింతమనేని సన్నిహితులు అభిమానులు చెపుతుంటారు. ఇక టీడీపీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూపార్టీలో తిరుగులేని నేతగా అధికార పక్షంపై పోరాటంలో ఎటువంటి జంకు లేనివిధంగాచింతమనేని ప్రభాకర్ముందుకెళ్తున్నారు. దెందులూరు నియోజకవర్గం పేరు చెప్పగానే చింతమనేని గుర్తుకొచ్చే ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజల కోసం నిత్యం ఎంతమంది వచ్చినా వారికి భోజన సదుపాయాలు కల్పించడం ఆయన ప్రత్యేకత,ఇక అధికారులతో పని చేయించే విషయంలోనూ ఎక్కడా రాజీ పడరని స్వభావం ఆయనది.

సరికొత్తగా బీసీ అస్త్రం..

- Advertisement -

తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో విజయమో? వీరస్వర్గమో? అనే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. సరి కొత్త వ్యూహ రచనలో నిమగ్నమైంది. సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుంది. అప్పటి వరకూ ..దెందులూరులో మరో సస్పెన్స్ తప్పటం లేదు. చింతమనేని ఎంపీగా పోటీకి దింపితే ఎలా ఉంటుందని టీడీపీ అధిష్టానంలో మేథోమధనం చేస్తోంది. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలే ఎక్కువ. ఈ స్థితిలో గౌడ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని టీడీపీ యోచిస్తే.. తనకు అవకాశం ఇవ్వాలని బీసీ నేత అశోక్ గౌడ్ ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశారు. 25 వేల ఓట్లు సాధించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చింతమనేనికి సన్నిహితంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే, చింతమనేని ఆశీస్సులతోఈ నియోజకవర్గ నుంచి పొటీచేయాలానే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జయహో బీసీ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విజయవంతం చేయడంలో చింతమనేనితో కలిసి గ్రామ గ్రామానికి పార్టీ వాణిని వినిపిస్తున్నారు.

సౌమ్యం.. స్నేహం అబ్బాయి సొంతం

గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో ఇదే నియోజకవర్గలో ఇదే కమ్మ సామాజిక వర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొట్టారు రామచంద్రరావు తనయుడు కొట్టారు అబ్బాయి చౌదరిని పోటీకి దించగా అబ్బాయి చౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. యువకుడు ఉత్సాహవంతుడు, విద్యావంతుడు అబ్బాయి చౌదరి రాజకీయాలకు కొత్త అయినప్పటికీ గత నాలుగున్నర ఏళ్ళకాలంలో నియోజవర్గంలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నియోజవర్గంలో రూ. 2500 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారు. పార్టీ ప్రకటించిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలోనూ ప్రతిపక్షంలో చింతమనేని వంటి దిగ్గజాన్ని ఎదుర్కోవడంలోనూ ఎక్కడా తగ్గేదే లేదంటూ హోరాహోరీగా తలపడుతూ వచ్చారు. ఒకే సామాజిక వర్గంలో టీడీపీలో చింతమనేని ప్రభాకర్, వైసీపీలో అబ్బాయి చౌదరితిరుగులేని నాయకులుగా ఎదిగారు.

వ్యవహార శైలి చాలా విరుద్ధం
ప్రజలతోనూ అధికారులతోనూ మాటామంచి వ్యవహార శైలిలో ఇద్దరు అభ్యర్థులలో పూర్తి వైరుధ్యం కనిపిస్తుంది. చింతమనేని ముక్కుసూటిగా మాట కటువుగా ఉంటే అబ్బాయి చౌదరి పలకరింపు సౌమ్యంగా స్నేహపూర్వకంగా నియోజకవర్గ ప్రజలతో మెలగడం పూర్తి సమయాన్ని వెచ్చించడం ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గ అవసరాలను గురించి పలు ప్రతిపాదనలు పెట్టడం అవకాశం ఉన్న మేరకు సాధించడం ద్వారా నియోజకవర్గ ప్రజలకు బాగా చేరువయ్యారు. గవర్నర్ పర్యటనసందర్భంగా అబ్బాయిచౌదరి ప్రజంటేషన్ ప్రజాప్రతినిధిగా అబ్బాయిచౌదరి పరిణితి కి అద్దంపట్టింది. ఒక విద్యావంతుడు ప్రజాప్రతినిధిగా ఎంపికయితే ఒకసబ్జక్ట్ ను ఉన్నత అధికారులదృష్టికి ఏవిధంగా తీసుకెళ్ళగలుగు తారనేది నిరూపించి గవర్నర్ నే ఆశ్చర్య పర్చారు. అబ్బాయిచౌదరి పల్లెనిద్రపేరుతో ప్రతిగ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు.

బాబు శాపాల దుమారం
నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా పోటీపోటీగా ఫ్లెక్సీలు కట్టించడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. చంద్రబాబు సభలో అబ్బాయి చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నియోజవర్గంలో సంచలనం సృష్టించాయి. లండన్ బాబును మళ్ళీ తిరిగి శాశ్వతంగా లండన్ పంపిస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నియోజవర్గంలో రాజకీయ దుమారాన్ని లేపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement