Friday, May 3, 2024

బిగ్‌బాస్‌.. ఓ చెత్త రియాలిటీ షో, ఇలాంటి షోలతో అనర్థాలనేకం: హైకోర్టు

అమరావతి, ఆంధ్రప్రభ: బిగ్‌బాస్‌.. ఓ చెత్త రియాలిటీ షో.. ఇలాంటి వాటివల్ల యువత పెడదారి పడుతోంది.. సమాజం ఎటు వెళుతోందో అర్థం కావటంలేదు.. పెడధోరణులు పెచ్చరిల్లుతున్నాయని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా స్తబ్దతుగా ఉంటే అనర్థాలు తప్పవు.. దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించింది. ఎలాంటి సెన్సార్‌షిప్‌ లేకుండా బిగ్‌బాస్‌షోను ప్రసారం చేస్తున్నారని కేవలం ధనార్జనే ధ్యేయంగా యువతను పెడమార్గం పట్టిస్తున్న ఇలాంటి షోలను నియంత్రించాలని కోరుతూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అహ్సదుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావుల నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. పిల్‌పై జగదీశ్వర్‌రెడ్డి తరుపు న్యాయవాది గుండాల ప్రసాదరెడ్డి సోమవారం ధర్మాసనం ముందు ప్రస్తావించారు. విచారణ జరపాలని అభ్యర్థించారు.

బిగ్‌బాస్‌ లాంటి కార్యక్రమాలు యువత భవిష్యత్‌ను కాలరాస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సమాజానికి ఉపయోగంగా ఉండే మంచి వ్యాజ్యం దాఖలు చేశారని ప్రశంసించింది. బిగ్‌బాస్‌ లాంటి షోలపై ఇన్నిరోజులు పిటిషన్‌లు ఎందుకు రావటంలేదా అనుకున్నాం.. ఇప్పుడు సమయం వచ్చింది.. ఇలాంటి చెత్త షోల వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయి. సమాజంలో అసభ్యకర, అశ్లిdలతను పెంచిపోషిస్తున్నాయి.. ఇలాంటి వాటితో తమకు ఇబ్బందిలేదని ప్రజలు అనుకుంటున్నారు.. తమ పిల్లలు బాగున్నారని మిన్నకుంటున్నారు.. సమాజంలో ఇతరుల గురించి పట్టించుకోకపోతే అదే సమస్య మన వరకు వచ్చినప్పుడు మిగిలిన వారు స్పందించరని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని అంతా గ్రహించాలని హితవు పలికింది. బిగ్‌బాస్‌ షో ఎప్పటి నుంచో వస్తుంటే ఇప్పటి వరకు ఏంచేశారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. దీనిపై 2019లోనే పిటిషన్‌ దాఖలు చేసినట్లు పిటిషనర్‌ తరుపు న్యాయవాది గుర్తుచేశారు. ఇలాంటి వ్యాజ్యంలో ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీకాలేదా అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని ఇకనైనా కోర్టు స్పందిస్తుందనే భావనతో దీన్ని ప్రస్తావిస్తున్నట్లు న్యాయవాది ప్రసాదరెడ్డి తెలిపారు. దీంతో ఈ వ్యాజ్యంపై సోమవారమే విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రక టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement