Sunday, April 28, 2024

ఎపిలో క‌మలం కొత్త రూటు – పొత్తుల‌కు సై అంటున్న అధిష్టానం..

(అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) – ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనల్తో కలసి ఎన్నికల పొత్తు పెట్టుకునే పరిస్థితులు బిజెపిలో స్పష్టమౌతున్నాయి. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైకాపా, తెలుగుదేశం, జనసేన మూడూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేంద్రంలోని బిజెపికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోని 25మంది లోక్‌సభ సభ్యులు కూడా బి జెపి ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకొచ్చినా కేంద్ర స్థాయికొచ్చేసరికి తమ అదుపాజ్ఞల్లోనే ఉంటారన్న విశ్వాసం ఇంతవరకు బిజెపి అధిష్టానంలో ఉంది. కానీ ఇప్పుడు మోడి, అమిత్‌షాలు అంతటి తో సంతృప్తి చెందే పరిస్థితుల్లేవు. ఎపిలో కూడా బిజెపిని ఓ ప్రబల శక్తిగా రూపుదిద్దాలన్న ఆకాంక్ష వారిద్దరిలో వ్యక్తమౌతోంది. ఇక్కడ సొంతంగానే పునాదులేసుకోవాలన్న అభిలాష బిజెపిలో దీర్ఘకాలంగా నెలకొంది. ఇది కార్యరూపం దాల్చాలంటే ముందుగా రాష్ట్రంలో కొన్నైనా లోక్‌సభ, శాసనసభ సీట్లను బిజెపి సాధించు కోవాలి. ఇందుకు తెలుగుదేశం, జనసేన లతో పొత్తు ఒక్కటే మార్గం. 2024 ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయిలో బిజెపి తిరిగి ఘనవిజయం సాధించే పరిస్థితులున్నాయి. కాగా ప్రస్తుత కేంద్ర కేబినెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏ ఒక్కరికీ ప్రాతినిధ్యం లేదు. పక్కనున్న తెలంగాణాకు చెందిన కేంద్రమంత్రులే ఎపి వ్యవహారాలు కూడా జాతీయ స్థాయిలో చక్కబెట్టాల్సొస్తోంది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్‌ లోకి తీసుకునేందుక్కూడా అనుగుణమైన వ్యక్తులెవరూ బిజెపికి అందుబాటులో లేరు. దీంతో రాష్ట్రంలో బిజెపి భవిష్యత్‌ లో కూడా ఇదే తరహాలో నామమాత్రంగా
మిగిలిపోయే ప్రమాదాన్ని అధిష్టానం గుర్తించింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్ర బిజెపిని తప్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర పార్టీకి అధిష్టానం నుంచి సంకేతాలు కూడా అందాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఎపిలో బిజెపి ఒంటరిగానే పోటీ చేసింది. కానీ ఎన్నికల అనంతరం జనసేనతో ఆ పార్టీకి పొత్తు కుదిరింది. అయితే ఇది కేవలం నామమాత్రపు సయోద్యగానే కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న ప్రతిపాదనను జనసేనాని తెరపైకి తెచ్చారు. ఇందుకోసం టిడిపితో పొత్తుకు ఆయన సిద్దపడుతున్నారు. అయితే గతంలో చంద్రబాబుతో ఉన్న విబేధాల్ని దృష్టిలో పెట్టుకుని ఎపి బిజెపి ఈ కలయిక పట్ల వ్యతిరేకత కనబరుస్తోంది. పదే పదే కేంద్ర నాయకత్వానికి కూడా ఇదే విషయాన్ని నివేదిస్తోంది. వెళ్తే జనసేనతో లేదా జనంతో మాత్రమే తమ పొత్తు అంటూ ఎపి బిజెపి నాయకులు పదే పదే ప్రకటనలిస్తున్నారు. ఇంతవరకు వీరి సూచనలకు ఆమోదం తెలిపిన అధిష్టానం ఇప్పుడు రూటు మార్చింది. ఇందుకు పరిమితమైతే రాష్ట్రంలో బిజెపి విస్తరణకు అవకాశాలుండవని అధిష్టానం ఓ నిర్ణయానికొచ్చేసింది. పొత్తులతోనే పోటీకి సిద్దం కావాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఎపిలో బిజెపి, వైకాపాల మధ్య అనధికార పొత్తు కొనసాగుతోంది. వైకాపాకున్న 22మంది లోక్‌సభ సభ్యులు కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల ఆమోదానికి అనుకూలంగా ఓట్లేస్తున్నారు. వీరు ఏ రోజూ బిజెపిని ఓ విపక్షపార్టీగా పరిగణించలేదు. బిజెపికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగని రాష్ట్రంలో బహిరంగంగా బిజెపితో పొత్తుపెట్టుకునేందుకు వైకాపా సంసిద్దంగాలేదు. రాష్ట్రంలోని క్రిస్టియన్లు, ముస్లింల మద్దతు ఎక్కువగా వైకాపాకుంది. బిజెపితో జతకడితే వీరి మద్దతు కోల్పోవాల్సొస్తుందన్న భయం జగన్‌లో నెలకొంది. దీంతో తెరచాటు వ్యవహారంగా తప్ప బిజెపితో నేరుగా పొత్తు పెట్టుకుని బరిలో దిగేందుకు వైకాపా సాహసించడంలేదు. ఈ దశలో చంద్రబాబు, పవన్‌ల మధ్య ఇప్పటికే దాదాపుగా ఖ రారైన కూటమిలో చేరేందుకు బిజెపి అధిష్టానం కూడా సిద్దంగా ఉన్నట్లు రాజధాని వర్గా భోగట్టా. తద్వారా 2024ఎన్నికల్లో కనీసం పది లోక్‌సభ, 25శాసనసభ సీట్లకు పోటీ చేసి రాష్ట్రంలో పునాదులేర్పాటు చేసుకోవాలన్నది బిజెపి అధిష్టానం లక్ష్యంగా తెలుస్తోంది.

అలాగే చంద్రబాబుతో కలవడానికి ససేమీరా కుదరదంటూ ప్రకటనలిస్తున్న రాష్ట్ర నాయకత్వానికి కూడా ఇప్పటికే అధిష్టానం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్ర నాయకత్వాన్ని నమ్ముకుంటే ఇక ఎపిలో తమ పార్టీకి ఏమాత్రం ఎదుగుదల ఉండదన్న నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం వీరికి తేటతెల్లం చేసేసింది. బిజెపి ఏ కులానికో లేదా కుటుంబానికో చెందిన ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ దృక్పధంతో వ్యవహరించే పార్టీ. జాతీయ స్థాయిలోనే పొత్తులు, ఇతర అంశాలపై నిర్ణయాలుంటాయి. స్థానిక అంశాల్ని అధిష్టానం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోదు. అలాగే గత నాలుగేళ్ళుగా రాష్ట్రంలో పార్టీని ఉద్దరిస్తామన్న నాయకులెవరూ ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ఒక్క శాతం కూడా సఫలం కాలేకపోయారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ ఓటు బ్యాంక్‌ 0.84 శాతానికి మాత్రమే పరిమితమైంది. పక్కనున్న తెలంగాణా తరహాలో ఇతర పార్టీల్లోని బలమైన నాయకుల్ని ఆకర్షిం చడంలో ఎపి నాయకత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. వాళ్ళొద్దు.. వీళ్ళొద్దు.. అంటూ అధిష్టానం చెవిలో ఊదరగొట్టడం తప్ప తమకు తాముగా బలమైన నాయకుల్ని తెచ్చి పార్టీలో చేర్చే ప్రయత్నాల్ని ఎపి నాయకత్వం ఏనాడూ చేపట్టలేక పోయింది. పైగా ఉన్న పదిమంది లోనూ వర్గాలు, కుమ్ములాటల్తో పార్టీ మరింతగా కుంచించుకుపోయింది. ఈ దశలో పార్టీని ఇతర రాష్ట్రాల్తో సమానంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరించేందుకు అందుబాటులో ఉన్న తెలుగుదేశం, జనసేనల్తో పొత్తే సహేతుకమన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పొత్తు పొడిస్తే రాష్ట్రంలో బిజెపి కూడా ఓ బలమైన పార్టీగా రూపుదిద్దుకోవడం తధ్యమన్న విశ్వాసం పార్టీ సీనియర్లలో ఇప్పటికే స్పష్టమౌతోంది.

- Advertisement -

క‌ర్నాట‌క ఫ‌లితాల అనంత‌ర‌మే బిజెపి పొత్తుపై టిడిపి,జ‌న‌సేనల క్లారిటీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement