Friday, April 26, 2024

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో ఏపీ ప్రభుత్వం విఫలమైంది.. ఢిల్లీలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి హత్యకేసులోనే న్యాయం జరగడం లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

దీనిపై తన కేబినెట్ మంత్రులతో మాట్లాడిస్తే సరిపోదని, ఆయనే స్వయంగా మాట్లాడాలని మస్తాన్‌వలీ అన్నారు. ఈ హత్య కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. అత్యంత అమానవీయంగా వివేకానంద రెడ్డిని హతమార్చారని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ పీసీసీకి కొత్త నాయకత్వాన్ని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement