Sunday, May 5, 2024

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఏపీ ప్రభుత్వం పనితీరు భేష్ : భారతీ పవార్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ ప్రభుత్వం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో సమర్థవంతంగా వ్యవహరించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌ చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆమె ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండు డోసులు ఏపీలో 99శాతం పూర్తయినట్లు తెలిపారు. కేంద్ర కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో తీసుకొస్తున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నట్లు ఆమె చెప్పారు. గత రెండు రోజులుగా విజయవాడ, గుంటూరు పట్టణాల్లోని పలు ఆసుపత్రులు, వివిధ పథకాలను పరిశీలించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేస్తూ పేదల వద్దకు చేర్చడంలో బీజేపీ కార్యకర్తలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. శిశు మరణాల తగ్గింపు, ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చేసేందుకు మోడీ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుస్మాన్‌ భారత్‌ పథకంలో ఏపీ నుంచి 50లక్షల కుటుంబాలు లబ్దిపొందుతున్నాయన్నారు. ఇందుకోసం 90శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని తెలిపారు. ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఎయిమ్స్‌ ఏర్పాటు, ప్రభుత్వ వైద్యశాలల అప్‌గ్రెడేషన్‌, వైద్య విద్యను పటిష్టం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌ను వైద్య సేవలు అందిస్తోందన్నారు.

దీనికి ప్రభుత్వం రూ.1618 కోట్లు కేటాయించిందన్నారు.యూజీ, పీజీ తరగతులు ప్రారంభమైనట్లు చెపుతూ అక్కడ కొన్ని సమస్యలను గుర్తించామని, తొందరలోనే వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వైద్య రంగం పటిష్టతకు గత ఏడేళ్లలో 209 వైద్య కళాశాలలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 75శాతం యూజీ, 95శాతం పీజీ సీట్లు పెరిగాయని మంత్రి భారతీ తెలిపారు. ప్రభుత్వ రంగంలో 45శాతం, ప్రైవేటు రంగంలో 37శాతం వైద్య రంగం బలోపేతమైందన్నారు. మహిళా సాధికారతకు మంచి ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన శిశువుల జననమే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని, ఆ దిశగా అనేక కార్యక్రమాలు తీసుకొని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి జనారోగ్య పథకంపై ప్రజల్లో అవగాహనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య రంగానికి అత్యధిక నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నందున ప్రధాని మోడీ ఫొటో కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెపుతూ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆమె కోరారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నేతలు మాగంటి సుధాకర్‌ యాదవ్‌, పాకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement