Wednesday, May 22, 2024

ప్రభుత్వంపై జనసేనాని ఫైర్​.. మద్యనిషేధం హామీపై ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం..

అమరావతి, ఆంధ్రప్రభ : వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి విరుచుకుపడ్డారు. మద్యనిషేధ హామీపై ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ ఒక ట్వీట్‌ చేశారు. మద్యం విధానానికి సంబంధించి ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు చేశారు. సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి.. కాదు కాదు సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయాన్ని సంపాదిస్తాం అనేలా చేశారని ధ్వజమెత్తారు. ఏపీలో సారాబట్టీలు, డిస్ట్రలరీలు కూడా వారివేనని ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికేనని దుయ్యబట్టారు. ఈ ట్వీట్‌లో పవన్‌ క ల్యాణ్‌ కొన్ని బైబిల్‌ సూక్తులు, సామెతలను పోస్ట్‌ చేశారు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయమని, సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ ప్రభుత్వానికి చురకలు వేశారు.

హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయకు పవన్‌ శుభాకాంక్షలు..

హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ జన్మదినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాం క్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనకు ఉన్న మక్కువ, ముఖ్యంగా తెలంగాణ జీవన విధానంపై అవాజ్యమైన అనురాగం చూపడం తనను ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. ప్రతి ఏటా విజయదశమి అనంతరం ఆయన నిర్వహించే అలయ్‌ – బలయ్‌ వేడుక తనకెంతో ఇష్టమని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఈ వేడుకకు తనను ఆహ్వానించి గౌరవించిన విధానాన్ని మర్చిపోలేనని చెప్పారు. వివాదాలకు దూరంగా చిన్నా, పెద్ద అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించే దత్తాత్రేయ నిండు నూరేళ్లు వర్థిల్లాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement