Thursday, May 2, 2024

ఏపీ బడ్జెట్, గవర్నర్ ప్రసంగంలోని అంశాలను వ్యతిరేకిస్తున్నాం: సోము

ఏపీ బడ్జెట్ ను, గవర్నర్ ప్రసంగంలోని అంశాలను ఏపీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కొవిడ్, రైతాంగంపై ప్రభుత్వ వైఖరిని తాము ఖండిస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కారు చెప్పుకుంటున్న సంక్షేమ పథకాల కంటే చేయాల్సిన సంక్షేమం ఇంకా చాలా ఉందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. జగన్ చేపడుతున్న కార్యక్రమాల కంటే అవసరమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఎన్ఎస్ఎఫ్ డీసీ పథకం ద్వారా ఎస్సీలకు వ్యక్తిగతంగా సాయం చేయాలని కేంద్రం భావిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ పథకంలో భాగంగా రూ.15 లక్షల విలువైన ఇన్నోవా వాహనాలు పేద ఎస్సీలకు అందించే వీలుందని, అయితే రెండేళ్లుగా ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం మరుగునపడవేసిందని ఆరోపించారు. పేదలకు వ్యక్తిగతంగా రుణసదుపాయం అందించే పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని సోము ఆరోపించారు. అంతేకాకుండా ఎస్టీ, బీసీలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. కోవిడ్ పై పోరాటానికి కావలసినన్ని నిధులను కేటాయించలేదని, రైతాంగాన్ని పెడచెవిన పెట్టిందని సోము పేర్కొన్నారు.

కాగా, గురువారం ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 వార్షిక బడ్జెట్‌‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. 2021–22 రాష్ట్ర బడెట్‌ అంచనా రూ. 2,29,779.27 కోట్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement