Sunday, April 28, 2024

AP – ఒంగోలు, బాపట్ల ఎంపీ సీట్లపై పార్టీల క‌స‌ర‌త్తు

ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు – ఒంగోలు, పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎంపీ అభ్యర్థుల ఎంపిక లో ప్రధాన రాజకీయ పక్షాలు వైసీపీ, టీడీపీలు కసరత్తుల్లో మునిగి తేలుతున్నాయి. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఖరారు అయినట్లే. అధికారికంగా ఆయన పేరును ప్రకటించాల్సి ఉంది. కాగా ఇప్పటికే చెవిరెడ్డి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని నియోజకవర్గ ముఖ్య నాయకులతో భేటీ అవుతూనే ఉన్నారు. తాజాగా దర్శి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంటు రీజనల్ కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు బరిలో దిగనున్నారు. ఆ మేరకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. వీరిద్దరి మధ్య రసవత్తర పోటీ జరగనుంది.

బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి మళ్లీ నందిగం సురేష్ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల చెబుతున్నాయి. బాపట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేసులో దగ్గు మళ్ల ప్రసాదరావు. ఉండవల్లి శ్రీదేవి రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి ఎంపీ సీటు దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు భాగంగా వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందటంతో ఆ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ అధినేత పావులు కడుపుతో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుతో ముందుకు సాగుతున్నాయి. తమ గెలుపు ఖాయం అన్న ధీమాలో నేతలు ఉన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న ధీమాలో ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎంపీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు.

ఒంగోలు పార్లమెంట్ నుంచి మాగుంట శ్రీనివాస్ రెడ్డి రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడోసారి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగనున్నారు. దీంతో టీడీపీ అదృష్టం మాగుంట రాఘవరెడ్డికి కలిసి వస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ చర్చ తీవ్రంగా సాగుతోంది. మొత్తం మీద ఒంగోలు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను త్వరలోనే అధిష్టానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement