Thursday, May 16, 2024

AP: అధికారంలోకి రాగానే.. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. ష‌ర్మిల

ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న జగన్ సర్కార్!
ఉద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది
ఓపీఎస్‌ను అమలు చేస్తాం..
మేనిపెస్టోకు కట్టుబడి ఉన్నాం..
ఏపీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
కడప – ప్రభ న్యూస్ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు మీ ముందు మోకరిల్లిలా?.. వారిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ వారి హక్కులను కాలరాయడం బాధాకరమని ఏపీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ చెబుతున్న నవరత్నాలు నవ సందేహాలుగా మారాయన్నారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం పీడిస్తోందన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు కలుపుకుపోయే వారని గుర్తుచేశారు. మరి అయన బిడ్డ జగన్ చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. కొంతమంది బొత్స లాంటి వారు బహిరంగంగా బెదిరించడం ఏంటి అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని.. వారి గొంతు నొక్కడం సరికాదన్నారు. ఓపీఎస్ కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. ఉద్యోగుల డిమాండ్స్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అన్ని విధాలా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. టీఏ, డీఏ కూడా ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగుల హెచ్‌ఆర్‌లోను కోత పెట్టారని విమర్శించారు. మరోవైపు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్లు బకాయి పడిందని షర్మిల విమర్శించారు. చివరికి రూ.150 కోట్ల మెడికల్ బిల్లులనూ పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. వారి మొర ఆలకించే పరిస్థితే లేకుండా పోయిందన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని చెప్పారు.

12వ పీఆర్సీ అమలు చేయాల్సిన ప్రభుత్వం.. 11వ పీఆర్సీలోనే 4 శాతం కోతలు పెట్టిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఉద్యోగులను అన్నివిధాలా జగన్ మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓపీఎస్‌ను అమలు చేస్తుందని హామీ ఇస్తున్నామ‌న్నారు. మేనిపెస్టోకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్టంలో 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తాం.. అండగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తోందని షర్మిల తెలిపారు.

- Advertisement -

వృద్ధుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం..
రాష్ట్రంలో పింఛన్ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్‌కు సూచిస్తున్నానన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప.. వైసీపీ పార్టీకి మేలు చేయాలని ఇంత ఘోరంగా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ పార్టీకి అనుకూలంగా పని చెయ్యడం సీఎస్‌కు తగదంటూ వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులను తమకు అనుకూలంగా వాడుకోవడం సరికాదని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement