Thursday, April 25, 2024

రుషికొండ తవ్వకాలపై మరో కమిటీ..

అమరావతి, ఆంధ్రప్రభ: విశాఖపట్నం జిల్లా రుషికొండ తవ్వకాలపై మరో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ హైకోర్టుకు నివేదించింది. గతంలో ఏర్పాటయిన కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండటాన్ని తప్పుపట్టిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ అధికారులతోనే కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సెంట్రల్‌ ప బ్లిక్‌ వర్క్సు డిపార్టుమెంట్‌ కార్యనిర్వాహక ఇంజనీరు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ ప్రధాన శాస్త్రవేత్త వీఎస్‌ఎస్‌ శర్మ, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు శాస్త్రవేత్త డీ సౌమ్య, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టయినబుల్‌ కోస్టల్‌ మేనేజిమెంట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ మహాపాత్రలతో కొత్త కమిటీని
నియమించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తరుపున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌ హరినాథ్‌ కోర్టుకు మెమో రూపంలో సమర్పించారు.

విశాఖపట్నం జిల్లా యందాడ గ్రామంలో 19వ సర్వే నెంబరు భూమి కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ పరిధిలో ఉందని అక్కడ అక్రమ తవ్వకాలకు, చెట్ల నరికివేతకు అధికారులు కేంద్ర పర్యావరణ అటవీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వటంతో పాటు విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ) మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా ఉందని జనసేన పార్టీ కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తరువాత ఇదే అంశంపై తెలుగుదేశం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా పిల్‌ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు రుషికొండపై మొదట ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నందున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వమే అభియోగాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇక్కడి అధికారులను నియమించటం సరికాదని చెప్తూ మరో బాధ్యతాయుతమైన అధికారి నేతృత్వంలో కమిటీని నియమించాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖను ఆదేశించింది.
ఈ మేరకు ఎంఓఈఎఫ్‌ తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది. నివేదిక సమర్పించేందుకు 8 వారాల గడువు కావాలని డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ కోర్టును కోరారు. వివరాలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లో నివేదికను అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ మార్చి 16వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై తవ్వకాలకు సంబంధించిన సమాచారాన్ని డీఎస్‌జీ ద్వారా కమిటీకి అందజేసేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement