Sunday, April 28, 2024

Andhra Pradesh – రిజర్వేషన్​ మిస్సైల్​! ముస్లిం ఓటు బ్యాంకుపై పార్టీల టెన్షన్

బీజేపీకి ముస్లింలు దూరం దూరం
బెడిసికొట్టనున్న రిజర్వేషన్ రద్దు ప్రచారం
ఏపీలో కూటమికి అప్పుడే ముచ్చెటలు
13 ఎంపీ స్థానాలు.. 91 అసెంబ్లీ స్థానాల్లో ఎఫెక్ట్​
కడప, కర్నూలు జిల్లాల్లో తీవ్ర ఆందోళన
గుంటూరులో అభ్యర్థుల గుండెల్లో గుబులు
విజయవాడ పశ్చిమలోనూ అదే స్థితి
కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్న ముస్లింలు
పునరాలోచన చేస్తున్న బడా లీడర్లు

ఆంధ్రప్రభ స్మార్ట్​, విజయవాడ ప్రతినిధి – అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలు అనుభవిస్తున్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని ఒడిశి సభలో హిందువులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వల విసిరారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగం దీన్ని అనుమతించదని అన్నారు.ముస్లింల 4 శాతం రిజర్వేషన్‌ను తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంపిణీ చేస్తామని తెలిపారు. “ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు. ఏపీలోనూ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ ఇదే నినాదం అందుకున్నారు. ఇప్పటికే ఏపీలో ముస్లింల‌ను దూరం చేసుకోలేక టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ముస్లిం వర్గాలను సముదాయిస్తున్నారు. ఇలాంటి స్థితిలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ముస్లిం వ‌ర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

- Advertisement -

ఏపీలో కూటమి అవాక్కు

ఏపీలో టీడీపీ, వైసీపీ ఇస్తున్న రంజాన్ తోఫా కంటే.. నాలుగు శాతం రిజర్వేషనే ముస్లింల‌కు ముఖ్యం. తమ బిడ్డలకు ఈ రోజున ఉన్నత చదువులకు అవకాశం వచ్చిందంటే.. రిజర్వేషన్ ఫలితమే. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా నిలిచిన ముస్లింలు.. అధికార పార్టీకి సలాం చేయటం సర్వసాధారణం. కానీ, బీజేపీ విసిరిన ముస్లిం వ్యతిరేక పాచికతో ఏపీలోని ముస్లింల‌లో ఆందోళన పెరిగింది. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నత‌రుణంలో ఇది ఇబ్బందిక‌రంగా మార‌నుంది. బీజేపీతో పొత్తు పెట్టుకోకవటంతో ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ప్రకటించడంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇరాకటంలో పడినట్టే.

13 లోక్‌స‌బ‌, 91 అసెంబ్లీ సీట్ల‌పై ప్ర‌భావం..

బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీలో టీడీపీ, జనసేన పరిస్థితి అంతుచిక్కటం లేదు. ఏం చేయాలో అర్థం కాని ధర్మసంకటంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి, ఎన్డీయే కూటమిని గెలిపిస్తే ఏపీలోనూ 4 శాతం రిజర్వేషన్ తీసేస్తారనే అభద్రతాభావంతో ముస్లింలు ఆలోచనలో పడ్డారు. యాంటీ ముస్లీం నిర్ణయం నిర్ణయ ప్రభావం కచ్చింతంగా వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో ఫలితాల్లో.. తీవ్ర ప్రభావం తప్పదని ప్రచారం జరుగుతోంది. ఏపీలో 13 ఎంపీ స్థానాలు, 91 అసెంబ్లీ స్థానాల్లో ముస్లీం వ్యతిరేక నినాదం కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దెబ్బ తప్పదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో అత్యధిక ముస్లీం జనాభా ఉన్న ప్రాంతాలపై అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రత్యేక దృష్టి సారించాయి. కానీ అభ్యర్థులను బరిలోకి దించే విషయంలోనూ ఆచీతూచీ వ్యవహరించాయి.

గుంటూరులో సెల్ఫ్ గోలే..

రాజకీయ చైతన్యానికి కీలక మైన గుంటూరు జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై ముస్లీం ఓటర్లే నిర్ణేతలు . అందుకే ముస్లీం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అన్ని పార్టీలు ముస్లీం భాయ్ల చుట్టూ తిరుగుతుంటారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు నగరంలో 18.05 శాతం ముస్లీంలు ఉన్నారు. నరసారావుపేటలో 22.52 శాతం, చిలకలూరిపేటలో 23.89 శాతం, వినుకొండలో 22.92 శాతం, పొన్నూరులో 21.13 శాతం ముస్లీం ఓట్లు ఉన్నాయి. అందుకే గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంపై ఇటు వైసీపీ, అటు ఎన్డీయే కూటమి ముస్లీంలనే బరిలోకి దించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తాఫ తనయ నూరి ఫాతిమా, టీడీపీ అభ్యర్థిగా అహ్మద్ నజర్ పోటీ చేస్తున్నారు. అంటే ఉమ్మడి జిల్లాలోని ముస్లీంలను ఆకట్టుకోవటానికే ఈ ప్రయత్నం జరిగింది. ఇక బీజేపీ సంధించిన రిజర్వేషన్ రద్దు అస్ర్తం పని చేస్తే.. నరసారావుపేట, చిలకలూరి పేట, వినుకొండ, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలకే కాదు.. నరసరావుపేట ఎంపీ అభ్యర్థికీ చిక్కులు తప్పవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కర్నూలులో కొంప కూలినట్టే

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముస్లీంల ప్రభావం ఎక్కువే. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అనేక ఎన్నికల్లో ముస్లీం నేతలకే ప్రాధాన్యం కనిపిస్తుంది. అటు కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటీ గానీ.. ఇటు వైసీపీ, టీడీపీ మధ్య పోటీ చరిత్రను పరిశీలిస్తే .. ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఓటమిపై ముస్లీంలు తీవ్ర ప్రభావం చూపించాయి. ముస్లీంల మద్దతు లేనిదే రాజకీయ పార్టీల మనుగడ లేదు. ఎందుకంటే .. కర్నూలు నగరం లో 34.39 శాతం, నంద్యాలలో 32.63 శాతం, ఆదోనిలో 26.49 శాతం, ఎమ్మిగనూరులో 22.81 శాతం, బేతంచర్లలో 23.32 శాతం, మామిడాలపాడులో 27.57 శాతం మంది ముస్లీం ఓటర్లు ఉన్నారు. ఇక బనగాన పల్లెలో హిందువులు 51.63 శాతం ఉంటే ముస్లీంలు 47.11 శాతం మంది ఉన్నారు. అందుకే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఐఎఎస్ మాజీ అధికారి ఎండీ ఇంతియాజ్ నుంచి వైసీపీ బరిలోకి దించితే.. నంద్యాలలో ఎన్ ఎండీ ఫరూక్ను టీడీపీ రంగంలోకి దించింది.

అనంత ప్రభావం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముస్లీం ఓటర్లు ఎక్కువే. ఈ జిల్లాలోనూ అన్ని రాజకీయ పార్టీలూ ముస్లీం ఓటర్ల కోసం వంగి వంగి సలాంలు చేస్తారు. కదిరి నియోజకవర్గంలో ముస్లీం అభ్యర్థులనే పోటీలోకి దించుతారు. ఈ ప్రభావం గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం నియోజకవర్గాలపై పడుతుంది. అనంతపురం జిల్లాల్లో ముస్లీంల ప్రభావాన్ని పరిశీలిస్తే అనంతపురం లో 21.02 శాతం, హిందూపురంలో 34.62 శాతం, గుంతకల్లులో 25.23 శాతం, తాడిపత్రిలో 26.58 శాతం, కదిరిలో 44.25 శాతం,హిందువులు 54.26 శాతం, గూటిలో 22.54 శాతం ముస్లీం ఓటర్లు ఉన్నారు. అందుకే కదిరి అసెంబ్లీ బరిలోకి మక్బుల్ అహ్మద్ ను వైసీపీ దించింది. ఇక హిందూపురంలో అనూహ్యంగా ఇనయతుల్లాకు కాంగ్రెస్ పార్టీ దించింది.

కడపలో కష్టమే

కడప జిల్లాలో ముస్లీం ఓటర్ల ప్రభావితం అంతా ఇంత కాదు. కడప నగరంలో 32.91 శాతం, ప్రొద్దుటూరు 25.58 శాతం, రాయచోటి 49.09 శాతం, రాజంపేట 20.75 శాతం, పులివెందుల 15.59 శాతం, జమ్మలమడుగు 20.86 శాతం, రామేశ్వరం 26.48 శాతం, నాగిరెడ్డి పల్లి 25.59 శాతం, మోడమీది పల్లి 27.16 శాతం, చెన్నముక్క పల్లి 49.87 శాతం ముస్లీం ఓటర్లు ఉన్నారు. కనీసం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లీం ఓటర్లే నిర్ణేతలుగా కనిస్తారు. ఇక్కడ ముస్లీంలు ఎవరికి మద్దతు పలికితే .. ఆ రాజకీయ పార్టీ మాత్రమే విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకూ ఉమ్మడి కడప జిల్లాపై కేంద్ర రాజకీయ ధోరణే ప్రభావం చూపించింది. ఈ జిల్లాలో బీజేపీకి నామమాత్రం బలం కూడా లేదు. టీడీపీలో కొందరు ముస్లీం నేతలు తమ సొంత బలంతోనే విజయం సాధించారు.

కడపపై కాంగ్రెస్ గురి

కడప జిల్లాలోని 10 అసెంబ్లీ, కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాల పరిధిలో కడప అసెంబ్లీ పరిధిలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఎస్ బి అంజాద్ భాష, కాంగ్రెస్ అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్ పోటీలో ఉన్నారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పూల మహమ్మద్ నజీర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,74,226 ఓట్లు ఉండగా అందులో 90 వేల ఓట్లు ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవిగా తెలుస్తోంది. కాగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కడపకు చెందిన నజీర్ అహ్మద్, తంబాలపల్లి కు చెందిన ఇస్మాయిల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ..

చిత్తూరు జిల్లాలో.. అన్ని రాజకీయ పార్టీలు ముస్లీంల మద్దతు కోసం వెంపర్లాడాల్సిందే. పీలేరు 32.57 శాతం , పలమనేరులో 28.81 శాతం, మదనపల్లిలో 24.83 శాతం, పుంగనూరులో 37.30 శాతం, కుప్పంలో 14.33 శాతం రేణిగుంటలో 18.23 శాతంముస్లీం ఓటర్లు ఉన్నారు. ఈ సారి మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు ముస్లీం అభ్యర్థులనే రంగంలోకి దించాయి. వైసీపీ నుంచి నిస్సార్అహ్మద్, టీడీపీ నుంచి తాజాహాన్భాషా పోటీ పడుతున్నారు.

ప్రకాశంలోనూ.. అదే స్థితి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ముస్లీంలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ జిల్లాలో కనీసం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లీం ఓటు బ్యాంకు ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రిజర్వేషన్ వ్యతిరేక నినాదం ముస్లీంల్లో గందరగోళం సృష్టించటం ఖాయం. బీజేపీపై వ్యతిరేక భావం పెరిగితే.. కూటమికి దెబ్బే. ఎందుకంటే కందుకూరు లో 18.84 శాతం, కనిగిరిలో 25.62 శాతం, గిద్దలూరులో 17.50 శాతం, పొదిలిలో 23.29 శాతం, సింగరాయకొండలో 25.06 శాతం, పామూరులో 23.03 శాతం , భంభం 35.80 శాతం ముస్లీం ఓటర్లు ఉన్నారు. ఇలాంటి స్థితిలో ప్రభుత్వ వ్యతిరేక భావనతో వైసీపీకి దూరమైన ముస్లీంలు.. బీజేపీ పుణ్యమాని పీచ్ ముడ్ అనటం ఖాయమని రాజకీయ పరిశీలకుల అంచనా. కానీ .. ముస్లీం ప్రభావిత రాష్ర్టాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తున్న తరుణంలో.. ఏపీలోనూ ముస్లీం వ్యతిరేక నినాదం ఎంత వరకు పని చేస్తుందో ? అలవి కాని ప్రశ్నే.

Advertisement

తాజా వార్తలు

Advertisement